Nalgonda: చారిత్రక సంపద, వారసత్వ విశేషాలకు పుట్టినిల్లు భారత దేశం. ప్రపంచంలో అనేక చరిత్రలకు పూర్వమే భారతీయ చరిత్ర విరాజిల్లింది అనేందుకు ఇప్పటికే అనేక ఆధారాలు లభించాయి. తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో కీలక చారిత్రక ఆధారం లభించింది. కాకతీయ, బౌద్ధమత ఆనవాళ్లు చారిత్రక శిల్పకళా సంపదకు నిలయం ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఈ ప్రాంతంలో రాతి, మధ్య యుగపు ఆనవాళ్లు, చిత్రాలు ప్రత్యక్షమవుతున్నాయి. నిజాం కాలంలో నిర్లక్ష్యానికి గురై.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాభవాన్ని కోల్పోయిన తెలంగాణ చారిత్రక సంపద స్వరాష్ట్రంలో వెలుగులోకి వస్తోంది. ప్రాచీన మానవుడి అడుగు జాడలతోపాటుగా వేలాది సంవత్సరాల క్రితం రాతికొండపై విశాలంగా చెక్కిన మహాభారత యుద్ధంలోని పద్మవ్యూహం చిత్రం బయటపడింది..
బొమ్మల రామారంలో..
యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలో అనేక ప్రాంతాల్లో ప్రాచీన కాలం నాటి ఆదిమానవుల క్షేత్రంతోపాటు రాతియుగపు ఆనవాళ్లు కనిపించాయి. వీటికి సంబంధించి ఇప్పకే అనేక ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. తాజాగా.. బొమ్మల రామారం మండలం మాచన్‌పల్లి రామునిగుట్టపై శివాలయం ఉంది. ఈ శివాలయంలోని కొలను లాంటి సహజ నీటి గుండం ఒడ్డున ఈ పద్మవ్యూహన్ని పోలిన చిత్రం ఉంది. తెలంగాణ చరిత్రబృందం సభ్యులు రామోజు హరగోపాల్, బీవీ భద్రగిరీశ్, అహోబిలం కరుణాకర్, కొరివి గోపాల్, మహ్మద్ నసీర్, అన్వర్, జమ్మన పల్లి రమేష్ బృందం ఈ ప్రదేశాన్ని పరిశీలించి చిత్రాన్ని కనుగొన్నారు. మహాభారత యుద్ధంలోని పద్మవ్యూహన్ని అతిపెద్ద పద్మవ్యూహం రాతిచిత్రం లభ్యం కావడంతో చరిత్రకారులు పరిశోధనలపై దృష్టి సారించారు. రాతికొండపై విశాలంగా చెక్కిన పద్మవ్యూహం చిత్రం సుమారు 8వేల సంవత్సరాల క్రితం నాటిదిగా చరిత్రకారులు భావిస్తున్నారు.
17వ శతాబ్దపు గ్రంథాల్లో..
కురుక్షేత్ర యుద్ధంలో తెలుగువారు కౌరవుల పక్షాన పోరాడినట్లు ఐతరేయ బ్రహ్మణం చెబుతోంది. 17వ శాతాబ్దం నుంచి తాంత్రిక గ్రంథాల్లో చక్రవ్యూహాలు, పద్మవ్యూహాల విషయాన్ని ప్రస్తావించారు. హళేబీడు దేవాలయం గోడలపై మహాభారత ఘట్టాలను చెక్కారు. ఈ దేవాలయంలో మహాభారత యుద్ధంలో అభిమన్యుడు పాల్గొన్న పద్మవ్యూహం ప్రత్యేకంగా చెక్కబడింది. పద్మవ్యూహంలో మాదిరిగానే ఈ రాతి చెక్కుడు బొమ్మలో కూడా ఒకే ద్వారం ఉంది. ప్రాచీన మానవుడి యుద్ధ నైపుణ్యతపై పలుచోట్ల చిత్రాలు లభ్యం అవుతున్నాయి. మహాభారత యుద్ధంలో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పద్మవ్యూహం రాతిచిత్రం ఇక్కడ చెక్కడానికి కారణాలను చరిత్రకారుడు పరిశోధిస్తున్నారు.