Kavitha : ఊహించినదే జరిగింది.. అనుకున్నదే నిజమైంది. కొద్దిరోజులుగా అధిష్టానం మీద తీవ్ర భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కవిత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పైగా తన తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నాయని.. కోవర్టులు తనను ఇబ్బంది పెడుతున్నారని.. తను రాసిన లేఖలను బహిర్గతం చేస్తున్నారని.. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని.. ఇలా రకరకాలుగా కవిత విమర్శలు చేశారు. ఇక సోమవారం అయితే ఒక అడుగు ముందుకేసి తన కుటుంబంలో ఉన్న ఇద్దరు కీలక వ్యక్తుల మీద అవినీతి ఆరోపణలు చేశారు జాగృతి అధినేత్రి. అంతేకాదు వారిపై సిబిఐ ఎందుకు చర్యలు తీసుకోదని డిమాండ్ కూడా చేశారు.
ఎప్పుడైతే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా అందుకుంది. మేము అంటున్నట్టుగానే కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందని.. అదే విషయాన్ని గులాబీ పార్టీ అధినేత కుమార్తె చెప్పారని.. ఇంతకంటే రుజువులు ఏం కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. జాగృతి అధినేత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో గులాబీ పార్టీ కీలక నేతలతో కారు పార్టీ అధిపతి భేటీ అయ్యారు. క్రమంలో మెజారిటీ నాయకులు జాగృతి అధినేత్రిపై సస్పెన్షన్ విధించాలని డిమాండ్ చేశారు. దానికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి గులాబీ బాస్ కుమార్తెను గతంలోనే సస్పెండ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అధిష్టానం వేచి చూసే ధోరణి ప్రదర్శించింది. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడం.. పైగా మరిన్ని విమర్శలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆఖరి అస్త్రంగా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. అధిష్టానం అంటే కెసిఆరే కాబట్టి.. ఆయనే తన కుమార్తెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాలలో సంచలనం నెలకొంది. అయితే పార్టీ తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి జాగృతి అధినేత్రి రాజీనామా చేస్తారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.