TS DSC: తెలంగాణ నిరుద్యోగులకు ఇదో గొప్ప న్యూస్

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2017లో 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ తర్వాత మళ్లీ రెండు నెలల క్రితం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6,612 టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.

Written By: Raj Shekar, Updated On : December 16, 2023 10:47 am

TS DSC

Follow us on

TS DSC: పదేళ్లు అధికారంలో ఉండి ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం చేసిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను తెలంగాణ ప్రజలు ఇటీవల గద్దె దించారు. తమను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్‌ను గెలిపించారు. పది రోజుల క్రితం కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువు దీరింది. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు, టీఎస్‌పీస్పీ ప్రక్షాళన, ఉద్యోగాల భర్తీపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు దాదాపు 12 వేల టీచర్‌ పోస్టులను గుర్తించినట్లు తెలిసింది. ఇప్పటికే భర్తీ చేయాలని నిర్ణయించిన 5,089 పోస్టులతో కలిపి అనుబంధ నోటిఫికేషన్‌ జారీచేసే అవకాశం ఉంది. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు గవర్నర్‌ తమిళసై శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు.

ఆరేళ్ల తర్వాత..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2017లో 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ తర్వాత మళ్లీ రెండు నెలల క్రితం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6,612 టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ పోస్టుల్లో పాఠశాల విద్యలో 5,089, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు మరో 1,523 ఉన్నట్లు ప్రకటించారు. వీటిని డిస్ట్రిక్ట్‌ సెలెక్షన్‌ కమిటీ (డీఎస్సీ) ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. కలెక్టర్లు నోటిఫికేషన్‌ కూడా జారీచేశారు. 5,089 పోస్టుల భర్తీకే నోటిఫికేష¯Œ ను జారీ చేశారు. మొత్తం 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు నవంబరు 20 నుంచి 30 వరకు పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా.. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పరీక్షలను వాయిదా వేశారు.

కొత్త ఖాళీల గుర్తింపు..
తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడంతో అదనపు పోస్టులను జత చేసి మెగా డీఎస్సీని నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే నోటిఫికేషన్‌లో పేర్కొన్న 5,089 పోస్టులకు అదనంగా మరో 4281 ఖాళీలను గుర్తించారు. వీటితో పాటు గతంలో ప్రకటించిన 1,523 స్పెషల్‌ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. వీటితోపాటు మోడల్‌ స్కూళ్లలో మరో 1,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. పదోన్నతుల కారణంగా మరో 400 పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇలా మొత్తం 12 వేల పోస్టులకు పైగా భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. తద్వారా గతంలో దరఖాస్తు చేసిన వారూ అర్హులవుతారని, కొత్త వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అంటున్నారు.

సిలబస్‌ మారుస్తారా..?
టీచర్‌ పోస్టులకు సంబంధించిన సిలబ్‌సను మారుస్తారా? లేక పాతదే కొనసాగిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రెండు నెలల క్రితం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇప్పటికే సిలబ్‌సను ప్రకటించారు. ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు విడివిడిగా సిలబ్‌స్‌ రూపొందించారు. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. 160 ప్రశ్నలతో పేపర్‌ను తయారు చేయనున్నారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులను కేటాయించారు. అలాగే టెట్‌కు 20 మార్కుల వెయిటేజీని ఇస్తారు. అయితే.. గత సిలబస్‌ కొనసాగుతుందా? లేక మార్పులు చేస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.