Maoists Surrendered: దండకారణ్యం మొత్తం వారి చేతిలో ఉండేది. చెట్టు దగ్గర నుంచి మొదలు పెడితే పుట్ట దగ్గర వరకు వారి ఆధీనంలో ఉండేది. ఎక్కడ ల్యాండ్ మమైన్లు పెట్టారో? ఎక్కడ బాంబీ ట్రూప్ లు అమర్చారో? మావోయిస్టులకు పూర్తిగా తెలుసు. ఇలా దశాబ్దాలుగా దండకారణ్యంలో మావోయిస్టులు సమాంతర పరిపాలన సాగిస్తున్నారు. ఒకరకంగా అడవిని తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మావోయిస్టులను అణచివేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ.. అవి అంతగా సఫలం కాలేదు. మధ్యలో శాంతి చర్చలు జరిగినప్పటికీ ఆ తర్వాత సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది.
ఇన్నాళ్లకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ మొదలుపెట్టింది. మావోయిస్టులను వచ్చే ఏడాది కల్లా లేకుండా చేయడానికి గట్టి ప్రణాళికలు రూపొందించింది.. ఈ క్రమంలోనే కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది.. మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు మావోయిస్టులకు గట్టిపట్టు ఉన్న ప్రాంతాలలో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తోంది. జనజీవన స్రవంతిలో కలవడం తప్ప కాల్పులను నిలిపివేయడం సాధ్యం కాదని మొహమాటం లేకుండా చెప్పేసింది.
మావోయిస్టుల సమస్యను లేకుండా చేయడానికి కేంద్రం చేపడుతున్న ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయి. ఆపరేషన్ కగార్ వల్ల ఇప్పటికే చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు. ఒకప్పుడు పోలీసులకు కొరకరాని కొయ్యలాగా మారిపోయి.. ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన వారంతా ఇప్పుడు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఆశన్న నుంచి మొదలుపెడితే చంద్రన్న వరకు దిగ్గజ మావోయిస్టులు మొత్తం శరణు అంటూ తలవంచుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులు కేంద్రంతో నేరుగా తలపడి యుద్ధం చేసే పరిస్థితి లేదు. కనీసం ప్రతి కాల్పులు కూడా జరిపే ధైర్యం లేదు. ఇలాంటి స్థితిలో మావోయిస్టులు శరణమంటూ లొంగిపోవడం మినహా మరో దారి లేదు. ఇలాంటప్పుడు కొంతమంది మావోయిస్టులు సేఫ్ షెల్టర్ సెంటర్ కోసం పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాలకు వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ మావోయిస్టులు పశ్చిమ బెంగాల్ వెళ్ళినా సరే కేంద్ర బలగాలు ఊరుకోవు. వెంటాడి, వేటాడి చంపుతాయి. ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులు.. తమ ప్రజా సమస్యలపై పోరాడుతామని చెబుతున్నారు. అలాంటప్పుడు మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయి.. జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా సమస్యలపై పోరాడవచ్చు. ఎందుకంటే మన దేశం రాజ్యాంగబద్ధమైనది. ప్రజాస్వామ్యబద్ధమైనది. ఇక్కడ రాజ్యాంగానికి వ్యతిరేకంగా.. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నడుచుకోవడం ఏమాత్రం సాధ్యం కాదు. పైగా మావోయిస్టులు నమ్మిన చైనా దేశం కూడా పూర్తిగా కమ్యూనిజాన్ని దూరం పెడుతోంది. అలాంటప్పుడు మావోయిస్టులు కాలం చెల్లిన కమ్యూనిజాన్ని పట్టుకొని వేలాడితే ప్రజా సమస్యలు కాదు కదా.. ఊపిరి తీసుకోవడానికి ప్రాణం కూడా మిగిలి ఉండదు. ఎందుకంటే అమిత్ షా ఇప్పుడు ఆ స్థాయిలో యుద్ధం మొదలు పెట్టాడు. బలగాలతో దండకారణ్యంలో రణం కొనసాగిస్తున్నాడు.