KCR
KCR : అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలు.. భారత రాష్ట్ర సమితి వరుస ఓటములు ఎదుర్కొంది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో 0 ఫలితాలను సాధించింది. అయితే ఈ వైఫల్యాల నుంచి భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్, ఆ పార్టీ నాయకులు పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. పైగా సంక్షేమ పథకాల కోసం మాత్రమే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని.. లేకపోతే భారత రాష్ట్ర సమితి మాత్రమే గెలిచేదని కెసిఆర్ అంటున్నారు. అంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటమిని కెసిఆర్ ఇంకా గుర్తించలేకపోతున్నారు. కేవలం సంక్షేమ పథకాల కోసం మాత్రమే ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారని ఆయన నమ్ముతున్నారు.. కాంగ్రెస్ పార్టీని కాస్త పక్కన పెడితే.. గత పది సంవత్సరాల కాలంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసింది.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళిత బంధు, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి పథకాలను అమలు చేసింది. వీటికోసం భారీగానే ప్రచారం చేసుకుంది. అలాంటప్పుడు ఎందుకు భారత రాష్ట్ర సమితి ప్రజల మనసును చూరగొనలేకపోయింది.. ఈ ప్రశ్నలను ఏమాత్రం తమకు తాముగా భారత రాష్ట్ర సమితి నాయకులు వేసుకోలేకపోతున్నారు. గెలిచినప్పుడు మాత్రం తమ వల్లే అని చెప్పుకున్న నాయకులు.. ఓడిపోయినప్పుడు మాత్రం ప్రత్యర్థి పార్టీలపై తోసి వేయడం అలవాటుగా మారింది.
కారణాలను విశ్లేషించుకోరా..
రాజకీయ పార్టీ నాయకులు ఓటమికి గల కారణాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. అప్పుడే వారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. కానీ ఇటీవల ఎన్నికల్లో వరుస ఓటములను భారత రాష్ట్ర సమితి ఇప్పటికీ గుర్తించలేకపోతోంది. తప్పులను గ్రహించలేకపోతోంది. పైగా తమ తప్పు ఏదీ లేదనట్టుగా.. మొత్తం ప్రజలే చేశారు అన్నట్టుగా.. భారత రాష్ట్రపతి నాయకులు కామెంట్లు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు.. 10 సంవత్సరాల కాలంలో భారత రాష్ట్రపతి అధినేత కేసిఆర్, ఆ పార్టీ నాయకులు అందుబాటులో లేరు. ఇచ్చిన హామీలను సరిగ్గా అమలు చేయలేకపోయారు. ఇక కేంద్రంలోని బిజెపితో పేపర్ యుద్ధం సాగించారు. అధికారంలో ఉండి నిరసనలు చేపట్టారు.. అందువల్లే విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు జై కొట్టారంటే.. భారత రాష్ట్రపతి నాయకులు ఏ స్థాయిలో ప్రజలను ఇబ్బంది పెట్టారు అర్థం చేసుకోవచ్చు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల అవినీతి ఏకంగా ప్రగతి భవన్ వద్దకు చేరుకుంది. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మందలించే దాకా వెళ్ళింది. ఇవన్నీ చూశారు కాబట్టే ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. కెసిఆర్, ఆయన ఆధ్వర్యంలో సాగే మీడియా వీటన్నింటిని దాచినప్పటికీ.. ప్రజలు చూస్తూ ఊరుకోలేదు. అందువల్లే కుండ బద్దలు కొట్టినట్టు తమ తీర్పును ఇచ్చారు. ప్రజల తీర్పును గుర్తించే స్థితిలో భారత రాష్ట్ర సమితి నాయకులు లేరు. చివరికి ఆ పార్టీ అధినేత కూడా లేడు. పైగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలు సంక్షేమ పథకాల కోసం కక్కుర్తి పడ్డారని ఆరోపిస్తున్నారు.. ఇలాంటి వ్యాఖ్యలు కేసీఆర్ లాంటి నాయకుడు కూడా చేయడం వల్ల.. రాజకీయంగా ఆయన ఇంకా కిందికి దిగిపోతున్నారని అనుకోవాలి.