Telangana Development : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీ నేతలు తమ సొంత నియోజకవర్గాలపై చూపే ప్రత్యేక శ్రద్ధ, ఆ ప్రాంతాలకు నిధుల కేటాయింపు విషయంలో అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత పదేళ్లుగా బీఆర్ఎస్ (అప్పటి టీఆర్‌ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేట, గజ్వేల్, కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన సిరిసిల్లకు నిధుల వరద పారిందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందాయి. అయితే, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలను మాత్రం నిధులు అందక ఎండిపోయాయన్న విమర్శలు బలంగా వినిపించాయి. ఈ ధోరణి రాష్ట్రవ్యాప్త సమతుల్య అభివృద్ధికి అడ్డుగా నిలిచిందని అప్పట్లో ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆరోపించేవారు.
కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి?
ఇప్పుడు అధికార పగ్గాలు కాంగ్రెస్ చేతికి వచ్చాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆయన కూడా కేసీఆర్ బాటనే అనుసరిస్తున్నారనే విమర్శలు ఇప్పుడు కొత్తగా మొదలయ్యాయి. తాజాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లాలోని కొడంగల్‌కు వరుస పర్యటనలు చేస్తూ, ఆ ప్రాంతానికి నిధుల వరద పారిస్తున్నారని సమాచారం. కొడంగల్ పర్యటనలో భాగంగా అక్షయపాత్ర ఫౌండేషన్ కిచెన్‌ను పరిశీలించి, మిడ్‌డే మీల్స్ కిచెన్ భవన నిర్మాణానికి భూమిపూజ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే కాగా, అభివృద్ధి పనులన్నింటినీ దక్షిణ తెలంగాణ ప్రాంతానికే, ముఖ్యంగా వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకే తరలిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టుల కేటాయింపులు సైతం ఆ దిశగానే సాగుతున్నాయనే వాదనలు పెరుగుతున్నాయి.
రాష్ట్ర భవిష్యత్తు ఏంటి?
ఒక ముఖ్యమంత్రి తమ సొంత నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సహజమే అయినప్పటికీ, అది రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల అభివృద్ధిని, సమతుల్యతను దెబ్బతీయకూడదనేది ప్రజాభిప్రాయం. గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎదుర్కొంటోంది. ప్రజలందరి పక్షాన నిలబడాల్సిన ముఖ్యమంత్రి, పాలనా యంత్రాంగం కేవలం సొంత నియోజకవర్గాలు లేదా ప్రాంతాల అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తే… ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి. ప్రజల్లో అసంతృప్తి తలెత్తుతుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది.
పదేళ్ల పాటు ఉత్తర తెలంగాణ, ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాలు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత పొందాయని భావిస్తున్న తరుణంలో, ఇప్పుడు దక్షిణ తెలంగాణలోని కొడంగల్, పరిసర ప్రాంతాలకు అదే స్థాయి ప్రాధాన్యత లభిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నిధుల ప్రవాహం మారుతున్నా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని నియోజకవర్గాల అభివృద్ధి పట్ల ప్రభుత్వం సమాన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే, ఈ ‘సొంత నియోజకవర్గాల ప్రేమ’ రాష్ట్ర అభివృద్ధికి, అన్ని ప్రాంతాల ప్రజల సంక్షేమానికి అడ్డంకిగా మారుతుంది.