Kavitha Visits Harish Rao House: మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు అనారోగ్యంతో ఇటీవల కన్నుమూశారు. సత్యనారాయణ రావు అంత్యక్రియలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. తీవ్రమైన దుఃఖంలో ఉన్న హరీష్ రావును ఓదార్చారు. హరీష్ రావు తల్లి మాతృమూర్తి స్వయంగా కేసీఆర్ కు సోదరి కావడంతో ఆమెను కూడా ఓదార్చారు. కేటీఆర్ నుంచి మొదలు పెడితే గులాబీ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు మొత్తం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంత్యక్రియలు దగ్గరుండి నిర్వహించారు.
తన్నీరు హరీష్ రావు తండ్రి మరణించినప్పటికీ జాగృతి అధినేత్రి కవిత రాలేదు. పైగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి సంతాపం తెలిపారు. ఈ క్రమంలో కవిత వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ కవిత తన్నీరు హరీష్ రావును గురువారం పరామర్శించారు. గురువారం కోకాపేటలోని హరీష్ రావు నివాసానికి వెళ్లి సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ రావు కూడా ఉన్నారు.. ఇటీవల కాలంలో కల్వకుంట్ల కవిత హరీష్ రావును, సంతోష్ రావును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. కాలేశ్వరం అక్రమాల వ్యవహారాలలో హరీష్ రావుకు పాత్ర ఉందని కవిత ఆరోపించారు. సంతోష్ రావు టానిక్ వ్యవహారాన్ని కూడా కల్వకుంట్ల కవిత బయటపెట్టారు. ప్రస్తుతం జనం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కవిత అనేక సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు.
కవిత ఉన్నట్టుండి గురువారం హరీష్ రావును పరామర్శించారు.. వాస్తవానికి ఈ పరిణామాన్ని జాగృతి నేతలు కూడా ఊహించలేదు. కవిత అక్కడికి వెళ్తున్నట్టు కొంతమందికి మాత్రమే సమాచారం ఉంది. ఆ వ్యక్తులు ఆ సమాచారాన్ని బయటికి లీక్ కాకుండా చూసుకున్నారు. హరీష్ రావును కవిత పరామర్శించిన నేపథ్యంలో ఆ ఫోటోలు బయటకు రాకుండా చూసుకున్నారని తెలుస్తోంది. కవిత అంతరంగీకులు ఈ ఫోటోలు తీయడంతో సోషల్ మీడియాలోకి వచ్చాయి. దీంతో పాత పగలు మొత్తం పక్కనపెట్టి కవిత హరీష్ రావు వద్దకు వెళ్తే.. హరీష్ రావు మాత్రం తన కోపాన్ని అలాగే ఉంచుకున్నట్టు తెలుస్తోంది.
కవిత పరామర్శించిన సందర్భంలో హరీష్ రావు పెద్దగా పట్టించుకోలేదని.. కవిత నమస్కారం చేస్తే ఆయన ప్రతి నమస్కారం చేశారని తెలుస్తోంది. కవిత పెద్దగా మాట్లాడుకుండానే సత్యనారాయణ రావు చిత్రపటం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ సమయంలో కవిత వెంట అనిల్ రావు ఉన్నారు. అనంతరం హరీష్ రావు తో కొంతసేపు మాట్లాడిన కవిత ఆ తర్వాత భర్తతో కలిసి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది..