HomeతెలంగాణKavitha comments on KCR: కేసీఆర్ చెప్పింది మొత్తం ఉత్త కథ.. రేవంత్ రెడ్డిది పిట్ట...

Kavitha comments on KCR: కేసీఆర్ చెప్పింది మొత్తం ఉత్త కథ.. రేవంత్ రెడ్డిది పిట్ట కథ.. రెండు ముక్కల్లో తేల్చేసిన కవిత

Kavitha comments on KCR: కల్వకుంట్ల కవిత ఏమాత్రం తగ్గడం లేదు. మొన్నటిదాకా తన తండ్రి విషయంలో కాస్త జాగ్రత్తగానే వ్యవహరించారు. కానీ, ఇప్పుడు మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. ఈనెల 25న కొత్త రాజకీయ పార్టీని కవిత ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. నిన్న జగిత్యాలలో కేసీఆర్.. భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి పోటాపోటీగా సభలు నిర్వహించిన నేపథ్యంలో.. వాటి గురించి కల్వకుంట్ల కవిత స్పష్టంగానే చెప్పేశారు.

భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జగిత్యాల లో ఏర్పాటు చేసిన సభలో.. ప్రజల సమస్యలను ప్రస్తావించలేదు. కెసిఆర్ కేవలం ఉత్త కథలు మాత్రమే చెప్పారు. జాతీయ పార్టీ అయి ఉండి బిజెపి అమలు చేస్తున్న విధానాలను ప్రశ్నించలేదు. డీలిమిటేషన్ బిల్లు.. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆ పార్టీలో ఎలాగు మహిళలకు గౌరవం ఉండదు. అది వేరే విషయం.. 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టారు. చివరికి ఓటమికారణం ప్రజలు అని తప్పుపడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి ఉంటే నాకు తెలంగాణ గురించి ఎందుకని నాడు జీవన్ రెడ్డి అన్నారు. అటువంటి జీవన్ రెడ్డిని ఇప్పుడు పార్టీలోకి తీసుకున్నారు. 75 సంవత్సరాల కురవృద్ధుడు పార్టీకి ఏం చేస్తాడు.. తెలంగాణ ఉద్యమకారుల గురించి భారత రాష్ట్ర సమితి మాట్లాడలేదు. గుంటనక్క ఢిల్లీ వెళ్తే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీల్ కుదిరింది అని చెబుతున్నాడు. ఇన్ని లోపాలు కనిపిస్తుంటే.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎలా చెబుతారు.. గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎలా అంటారని” కవిత సూటిగానే ప్రశ్నించారు.

మహిళా బిల్లు గురించి తన తండ్రి మాట్లాడకపోవడాన్ని కవిత నేరుగానే ప్రశ్నించారు. మిగతా విషయాల గురించి మాట్లాడకుండా.. కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క విమర్శ కూడా చేయకుండా.. 10 సంవత్సరాల పరిపాలనలో ఏదో గొప్పలు చేశామని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని కవిత ప్రశ్నించారు. ఒకరకంగా కాంగ్రెస్ నేతలు చేయలేని పనిని కవిత చేసేశారు. అంతేకాదు సిరిసిల్ల నుంచి.. గజ్వేల్ నుంచి.. సిద్దిపేట నుంచి.. నారాయణఖేడ్ నుంచి భారీగా కార్యకర్తలు వస్తున్నారని.. వారందరికీ పార్టీ ఆవిర్భావం రోజు ఘనస్వాగతం పలుకుతున్నామని కవిత స్పష్టం చేశారు..

తండ్రి మాట్లాడిన మాటలను తీవ్రంగా తప్పు పట్టిన కవిత.. ముఖ్యమంత్రి విషయంలో కూడా అదే ధోరణి కొనసాగించారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్టుగా ప్రజాపాలన ఉండి ఉంటే.. రాష్ట్రంలో ప్రజలు ఈ స్థాయిలో ఎందుకు కష్టాలు పడతారని ఆమె ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలిపిచ్చారని.. దీనిని బట్టి రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్టు కవిత పేర్కొన్నారు. రైతులు మొక్కజొన్నలు పండిస్తే.. కొనే దిక్కు కూడా లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఎవరు ఉండాలో.. అధికార పక్షంలో ఎవరు ఉండాలో సీఎం ఎలా నిర్ణయిస్తారని కవిత ప్రశ్నించారు..

ఇంతే కాదు ఇంకా చాలా విషయాలను కవిత మొహమాటం లేకుండా చెప్పారు. వాస్తవానికి కెసిఆర్, రేవంత్ రెడ్డి సభలు నిర్వహించి గంటల వ్యవధి కూడా కాకముందే కవిత తెర ముందుకు వచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను.. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఆమె చెప్పేశారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో స్వీయ రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చే శక్తిగా తాము ఎదుగుతామని కవిత స్పష్టం చేశారు. కవిత ఈ స్థాయిలో మాట్లాడిన నేపథ్యంలో గులాబీ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారు? ఆమె విమర్శలకు ఎలాంటి సమాధానం చెప్తారు.. ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో విస్తృతంగా వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version