Kavitha Attended Alai Balai Program: తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు బండారు దత్తాత్రేయ బిజెపిలో కీలక నాయకుడిగా ఉండేవారు. అప్పట్లో ఆయన దసరా తర్వాత అలయ్ బలయ్ అనే కార్యక్రమం నిర్వహిస్తే గులాబీ పార్టీ నుంచి కేసీఆర్ హాజరయ్యేవారు. అంతేకాదు తెలంగాణ నాయకులను కలిసేవారు. మనసు విప్పి మాట్లాడేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కెసిఆర్ ఇటువంటి కార్యక్రమాలకు దూరం జరిగారు. అంతేకాదు తెలంగాణ సమాజానికి కూడా దూరమయ్యారు. అందువల్లే మూడోసారి అధికారాన్ని దక్కించుకోకుండా ఉండిపోయారు.
ఇప్పుడు ఆయన కుమార్తె, గులాబీ పార్టీ నుంచి బహిష్కృతమైన కల్వకుంట్ల కవిత తండ్రి లాగా ఉండడం లేదు. ఇటీవల రేవంత్ ఆరోపించినట్టుగా కలవకుండా ఉండడం లేదు. అందరి నేతలతో మాట్లాడుతోంది. ముఖ్యంగా తన జాగృతిలో బహుజన వాదం ఉండేలా చూసుకుంటున్నది. ఇటీవల ప్రకటించిన పదవులలో బహుజనులకే పెద్ద పీట వేసింది. అక్కడ దాకానే ఆగిపోలేదు.. బతుకమ్మ వేడుకల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంది. గతంలో ఏం జరిగింది.. అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఎలా వ్యవహరించింది.. అనే ప్రశ్నలు ఇక్కడ తర్కంలో నిలబడవు. ఎందుకంటే ఆమె పదే పదే చెబుతోంది కదా తనముందు ముళ్ళకంచెలు వేశారని.. వాటి నుంచి దాటుకు రావడానికి ఇంత టైం పట్టిందని.. పార్టీ నుంచి బయటికి రావడంతో కల్వకుంట్ల కవిత దత్తాత్రేయ నిర్వహించిన అలైబలై కార్యక్రమానికి హాజరైంది. తెలంగాణ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఎన్ గోపి ని పరామర్శించింది. అంతేకాదు కెసిఆర్ కాంపౌండ్ లో కీలకమైన వ్యక్తి నందిని సిద్ధారెడ్డిని కూడా కలిసింది. ఇలా చెప్పుకుంటూ పోతే కవిత ఎన్నో చేసింది.
వాస్తవానికి అలై బలై కార్యక్రమం అనేది తెలంగాణ రాజకీయాలకు అతీతమైనది. దీన్ని కూడా రాజకీయం లాగానే చూసాడు కేసీఆర్. 10 సంవత్సరాల కాలంలో అటువైపు కూడా చూడలేదు. ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వచ్చింది కాబట్టి కవిత తన తండ్రి కలవని వారిని.. తన తండ్రి పక్కన పెట్టిన వారిని కలుస్తోంది. విమలక్క, ఇతర బహుజన నేతలతో కలిసి నిన్న చాలాసేపు మాట్లాడింది. ఇవన్నీ కూడా కవిత రాజకీయ ప్రయాణాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఆమె అడుగులు ఎలా ఉంటాయనేది నిరూపిస్తున్నాయి.. అన్ని కలిసి వస్తే ఆమె వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచే పోటీ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలో కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పట్లో హరీష్ రావు వర్గం మర్చిపోదు. అలాగని కేవలం హరీష్ రావుకు మాత్రమే కవిత పక్కల బల్లెం కాదు.. మొత్తంగా గులాబీ క్యాంపుకే ఆమె ప్రధాన అవరోధం. ఆమె పార్టీ పెడుతుందా? ఇలాగే ఉంటుందా? ఇంకా ఎవరి సపోర్ట్ అయినా తీసుకుంటుందా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుంది.