Jubilee Hills By Elections: కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విధానాలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు స్వర్గీయ ఎన్టీ రామారావు. పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. తెలుగు జాతి ఖ్యాతిని ఢిల్లీ వేదికగా ఇనుమడింపజేశారు. ఏకంగా ఢిల్లీ పెద్దలను ఆయన సవాల్ చేశారు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రూపాయికి కిలో బియ్యాన్ని, పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు, జనతా వస్త్రాల పంపిణీ, సంపూర్ణ మధ్యపాన నిషేధం, ఇంకా అనేక రకాలైన విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు సీనియర్ ఎన్టీఆర్. ఒక రకంగా సీనియర్ ఎన్టీఆర్ తన తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువుగా ఉన్నారు.
భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన రాజకీయ పార్టీగా ఎదిగింది. రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. మూడోసారి మాత్రం అధికారంలోకి రాలేకపోయింది.. అధికారంలో ఉన్నప్పుడు గానీ.. అంతకుముందు గాని సీనియర్ ఎన్టీఆర్ ను ఎన్నడూ గులాబీ పార్టీ కీర్తించలేదు. గుర్తించనూ లేదు. చివరికి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ ప్రాంతాన్ని తొలగించిందని ఆరోపణలు కూడా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షంగా ఉంది. ఈ రెండు పార్టీలు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హోరాహోరిగా పోరాడుతున్నాయి. ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎక్కువగా కమ్మ ఓటర్లు ఉన్నారు. సెటిలర్లు కూడా అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి ఓట్లను దక్కించుకునేందుకు ఈ రెండు పార్టీలు సీనియర్ ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి తన తుదిశ్వాస వరకు కూడా సీనియర్ ఎన్టీఆర్ బద్ధ శత్రువు గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనను అలానే చూసింది. భారత రాష్ట్ర సమితి కూడా సీనియర్ ఎన్టీఆర్ వ్యవహారంలో ఎన్నడు కూడా సానుకూలంగా వ్యవహరించలేదు. పైగా భారత రాష్ట్రపతి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలోనే ఏర్పడింది కాబట్టి.. తెలంగాణ ఉద్యమకారుల వరకే ఆ పార్టీ పరిమితమైపోయింది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎలాగైనా గెలవాలి కాబట్టి ఈ రెండు పార్టీలు సీనియర్ ఎన్టీఆర్ జపం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు. మరోవైపు కేటీఆర్ కూడా అమీర్పేట ప్రాంతంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు.. బిజెపి మాత్రం సీనియర్ ఎన్టీఆర్ విషయంలో ఏ హామీ కూడా ఇవ్వడం లేదు.
రాజకీయాలలో శాశ్వతమైన శత్రువులు ఉండరు. శాశ్వతమైన మిత్రులు ఉండరు. అవసరాల ఆధారంగానే రాజకీయాలు నడుస్తుంటాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మినహాయింపు కాదు. అందువల్లే ఈ రెండు రాజకీయ పార్టీలు సీనియర్ ఎన్టీఆర్ ను స్మరిస్తున్నాయి. అవసరం లేకున్నా సరే ఆయన పేరును పలకరిస్తున్నాయి.. అయితే ఈ రెండు పార్టీలు సీనియర్ ఎన్టీఆర్ కు ఏం చేశాయో జూబ్లీహిల్స్ ఓటర్లకు ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ అనేది నవంబర్ 14న ఫలితం రూపంలో కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.