Heavy Rains: ఆకాశానికి చిల్లుపడ్డట్టు.. వరుణ దేవుడికి పట్టరాని కోపం వచ్చినట్టు.. కుండ పోత వాన.. జోరైన జడివాన.. మిన్నూ మన్నూ ఏకం చేసే విధంగా వర్షం కురిసింది. వర్షం ధాటికి కొండ ప్రాంతాల నుంచి వరద విపరీతంగా వచ్చింది. చెట్లు కొట్టుకు వచ్చాయి. రోడ్లు నామరూపాలు లేకుండా పోయాయి. పెద్ద పెద్ద భవనాలు కుప్ప కూలిపోయాయి. వంతెనలు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.
కుండపోత వర్షాలు
జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే ఈ రాష్ట్రాలలో క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. వర్షాలు విపరీతంగా కురవడంతో ఈ రాష్ట్రాలలో విపరీతమైన నష్టం చోటుచేసుకుంది. కనివిని ఎరుగని స్థాయిలో జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ నగరంలో గడచిన 12 గంటల్లో ఏకంగా 30 సెంటీమీటర్ల కు మించిన వర్షపాతం నమోదయింది. రోడ్లపై నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పాఠశాలలు, కళాశాలకు సెలవు ప్రకటించారు. మరోవైపు పంజాబ్ రాష్ట్రంలోనూ విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు కూడా ముంచెత్తుతున్నాయి. వరద వల్ల రోడ్లు నామరూపాలు కోల్పోయాయి. భవనాలు చూస్తుండగానే నేలకూలిపోయాయి. పంట పొలాలు ఇసుక మేటలు వేశాయి.
ఎందుకీ వర్షాలు
హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉన్న రాష్ట్రాలలో ఈ ఏడాది విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. మండు వేసవిలోనే ఈ ప్రాంతంలో వర్షాలు కురిశాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. కాకపోతే గడిచిన వాన కాలంలో ఈ స్థాయిలో వర్షాలు కురవలేదు. ఈసారి మాత్రం విపరీతమైన వర్షాలు కురుస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ వర్షాల వల్ల వందల కోట్లలో నష్టం వాటిల్లు ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. మరి కొద్ది రోజులపాటు ఈ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. వరద నీటి వల్ల ఈ ప్రాంతంలోని నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో దట్టమైన మేఘాలు ఆవరించి ఉండటం వల్ల క్లౌడ్ బరస్ట్ ఏర్పడుతోందని.. గతంలో ఎన్నడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని నిపుణులు చెబుతున్నారు. ఈ స్థాయిలో వర్షాలు కురుస్తుంటే మనుషులు బతకడం కష్టమేనని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.