Ibomma: బాహుబలి సినిమా విడుదలకు ముందు కూడా ఐ బొమ్మ ఉంది. అయినప్పటికీ ఆ సినిమా వేల కోట్లు కలెక్షన్లు సొంతం చేసుకుంది. అక్కడిదాకా ఎందుకు మొన్న వచ్చిన లిటిల్ హర్ట్స్ అనే సినిమా దాదాపు పది కోట్ల వరకు వసూలు చేసింది. బొమ్మలో దమ్ముంటే.. కథలో బలముంటే ఐ బొమ్మ కాదు కదా, ఇంకే బొమ్మ కూడా ఏమీ చేయలేదు. వాస్తవానికి ఈ విషయాన్ని నిర్మాతలు మర్చిపోతున్నారు.
మలయాళ పరిశ్రమలో కథా బలం ఉన్న సినిమాలు తీస్తారు. భోజ్ పూరి పరిశ్రమలు మాస్, మసాలా, ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు తీస్తారు. సౌత్ కొరియన్ మూవీలో బోలెడంత ఫీల్, టన్నులకొద్దీ క్రియేటివిటీ ఉంటాయి. హాలీవుడ్ సినిమాలలో భారీ బడ్జెట్ తో కూడిన అద్భుతమైన నాణ్యత ఉంటుంది. ఇక తెలుగు సినిమా విషయానికి వచ్చేసరికి మలయాళ సినిమాల మాదిరిగా కదల ఉండదు. భోజ్ మాదిరిగా మసాలా ఉండదు. కొరియన్ అనుభూతి, హాలీవుడ్ నాణ్యత మచ్చుకు కూడా కనిపించదు. అయినప్పటికీ తెలుగు హీరో, హీరోయిన్, దర్శకులు వాళ్ళ రెమ్యూనరేషన్లతో కలుపుకొని వందల కోట్ల సినిమాలు తీస్తారు. కొన్నిసార్లు బడ్జెట్ వేలకోట్లకు కూడా చేరుకుంటుంది. వాటిని జనాల మీద ఫ్యాన్ ఇండియా, పాన్ వరల్డ్, ఫ్యాన్ సోలార్ సినిమాలని ముద్ర వేస్తారు. సినిమా విడుదలైన గంటలోనే బోకుబస్టర్.. అంటూ పోస్టర్లు రిలీజ్ చేస్తారు. చివరికి తమ పెట్టుబడిన పెట్టుబడి చచ్చినట్టు ప్రేక్షకులు ఇవ్వాల్సిందేనని ఉన్మాదంతో మాట్లాడుతుంటారు. ప్రెస్మీట్లో తెగ ఉడికిపోతుంటారు.
ఐ బొమ్మ లాంటి శిరోభారాలు హాలీవుడ్ నుంచి అన్ని సినిమాలకు ఉన్నాయి. ఐ బొమ్మ లేదా మై రూల్స్, తమిళ్ రాకర్స్.. ఇంకొకటి.. మరొకటి.. వాస్తవానికి మిగతా ఇండస్ట్రీలకు లేనంతగా తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే ఎందుకు ఇంతలా శోకాలు పెట్టింది.. తెలుగు నిర్మాతలకే ఐ బొమ్మతో ఎందుకు బొమ్మ కనపడింది.. సరిగ్గా ఇవే ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. మలయాళ చిత్రాల మాదిరిగా మనవారికి కథలు చెప్పే అంత దమ్ము లేదు. భోజ్ పూరి మాదిరిగా తక్కువలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం సాధ్యం కావడం లేదు. “ఏనుగుకు తిండి పెట్టడం లేదు. మావటికి మాత్రం ఉలవలను క్వింటాలకు క్వింటాళ్లు పెడుతున్నారన్నట్టుగా” నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. చివరికి అయ్యగారి సంపాదన అమ్మవారి బొట్టు బిల్లలకు కూడా సరిపోవడం లేదన్నట్టుగా.. ప్రేక్షకుల డబ్బులు హీరో, హీరోయిన్లు, ఐటమ్ గర్ల్స్, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యూనరేషన్లకు సరిపోవడం లేదు. పైగా చాలామంది స్టార్ హీరోలకు ఆల్ట్రామోడల్ మల్టీప్లెక్స్ లలో భాగస్వామ్యం ఉంటుంది. అక్కడ సినిమా మధ్యలో పాప్ కార్న్ కొనుగోలు చేస్తే మధ్యతరగతి వారు ఆ లోటు పూడ్చుకోవడానికి ఏకంగా పర్సనల్ లోన్ తీసుకోవాలి.
వాస్తవానికి ఇంత దోపిడీ జరుగుతుంటే.. ప్రేక్షకులను వినోదం పేరుతో ఇలా ముంచేస్తుంటే ఎవరూ మాట్లాడరు. చిరంజీవి లాంటివారు నోరు మూసుకుంటారు. నాగార్జునలాంటివారు సైలెంట్ అయిపోతారు. దిల్ రాజు ఇలాంటి నిర్మాతలు మాత్రం సేఫ్ అవుతారు. ఇక్కడ నిర్మాతలు.. ఇతర వర్గాలు విస్మరిస్తున్న విషయం ఒకటి ఉంది..
ఐ బొమ్మ ఇంటర్నెట్ లో దుమ్ము లేపుతున్నప్పుడే బాహుబలి లాంటి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఐ బొమ్మ వందలకొద్ది డొమైన్లతో విరుచుకుపడుతున్నప్పుడే లిటిల్ హార్ట్స్ అనే సినిమా కలెక్షన్లను కొల్లగొట్టింది. స్థూలంగా చెప్పాలంటే బొమ్మ బాగుంటేనే నిర్మాతలకు కాసుల పంట పడుతుంది. బొమ్మ బాగోలేకపోతే ఎవరూ చూడరు. ఓటీటీ, యూట్యూబ్ లలో పెట్టినప్పటికీ సినిమాలను దేకరు. వాటిల్లో దమ్ము లేకపోవడం వల్లే దుమ్ము కొట్టుకొని పోతాయి. అయితే ఇక్కడ మేము ఐ బొమ్మను గొప్ప వెబ్సైట్ అని.. దానిని నడిపిన వ్యక్తి గొప్ప వ్యక్తి అని చెప్పడం లేదు. మన దేశ రాజ్యాంగం ప్రకారం.. చట్టాల ప్రకారం కచ్చితంగా అతడు నేరస్థుడు.
సినిమా రంగంలో ఉన్న వారంతా కథను, సీన్లను, ట్యూన్లను, చివరికి కాస్ట్యూమ్లను కాపీ కొట్టి.. హడావిడి చేసి.. మళ్లీ వాటిని వేరే వాడెవడో కాపీ కొట్టాడని నెత్తినోరు కొట్టుకోవడమే ఇక్కడ అసలైన పిటి! ఇప్పుడు ఐ బొమ్మ చరిత్ర ముగిసిపోయింది కాబట్టి సినిమా థియేటర్లో ప్రేక్షకులతో కిటకిటలాడుతాయా.. ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూలు చేస్తుందా.. దీనికి ఎవడూ సమాధానం చెప్పలేడు. అన్నట్టు నిన్నటి ప్రెస్మీట్లో రాజమౌళి వీర లెవెల్ లో మాట్లాడాడు. 2027 లో విడుదలయ్యే వారణాసి సినిమా టికెట్ ధరను 1000 చేస్తాడా ఏంటి?