Hydra Jubilee Hills: ఇవాల్టికి హైదరాబాదులో ఒక మోస్తారు వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శివారు ప్రాంతాలు నీట మునుగుతుంటాయి. ఇక అడుగు తీసి అడుగు వేయాలంటే నరకం కనిపిస్తుంది. ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంటుందో.. సగటు హైదరాబాదీ ని అడిగితే తెలుస్తుంది. దీని అంతటికీ కారణం చెరువులను చెరబట్టడం.. నాలాలను ఆక్రమించడం.. కాలువలను పూడ్చివేయడం.. అందువల్లే హైదరాబాద్ వర్షాకాలంలో చిగురుటాకులా వణికి పోతూ ఉంటుంది. ఇలానే పరిస్థితి కొనసాగితే హైదరాబాద్ సర్వనాశనం అవుతుంది అని భావించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చారు. అయితే ప్రారంభంలో హైడ్రా కూల్చివేతలు జరిపినప్పుడు సగటు తెలంగాణ వాసి నుంచి ఆమోదం లభించింది. ఆ తర్వాత రాజకీయ నాయకులు ఈ వ్యవహారాన్ని ప్రశ్నించడంతో నెగిటివ్ కోణం తెలంగాణ వ్యాప్తమైంది. అయినప్పటికీ హైడ్రా తన పని తీరు లో ఏమాత్రం తగ్గడం లేదు. పైగా చెరువులను పరిరక్షించడానికి తనవంతుగా అడుగులు వేస్తున్నది.
ఇక శుక్రవారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో 200 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని హైడ్రా కాపాడింది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 41 లో శ్రీనివాస అనే వ్యక్తి రెండు ఎకరాల పార్కుకు వెళ్లే మార్గంలో 30 అడుగుల మేర రోడ్డును సగం వరకు ఆక్రమించాడు. అందులో హాస్టల్, కార్ రిపేర్ షెడ్ నిర్మించాడు. ప్రతినెల 10 లక్షల వరకు అద్దెలు వసూలు చేస్తున్నాడు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలు మొత్తం కూల్చేసింది.. ఆక్రమణలను పడగొడుతున్నప్పుడు పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు.. వాస్తవానికి మన వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే ఇలాంటి శ్రీనివాస్ లు పుట్టుకురారు. ఇలా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించరు.. రెవిన్యూ దగ్గర నుంచి మొదలుపెడితే జిహెచ్ఎంసి వరకు ఆన్నిచోట్ల అవినీతి అధికారులు ఉండడంతో ఇలాంటి వారికి అనుమతులు త్వరగానే లభిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ భూములు హారతి కర్పూరం అవుతున్నాయి.
పార్క్ కి వెళ్లే రోడ్డును అతడు ఏకంగా ఆక్రమించాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అద్దెల ద్వారా నెలకు 10 లక్షల సంపాదిస్తున్నాడు అంటే అక్రమం ఎంతవరకు పెరిగిపోయిందో ఊహించుకోవచ్చు. ఇలాంటి అక్రమార్కుల వరకే ఆగిపోకుండా.. ప్రభుత్వ ఆస్తులను.. భూములను ఆక్రమించిన ప్రతి దుర్మార్గుడికి హైడ్రా ఇలాంటి పాఠం చెబితే కచ్చితంగా హైదరాబాద్ బాగుపడుతుంది. హైదరాబాద్ మాత్రమే కాదు యావత్ తెలంగాణ మొత్తం ఆక్రమణల పాలు కాకుండా ఉంటుంది. మరి ఇంతటి స్వేచ్ఛను ప్రభుత్వం మిగతా వారి విషయంలో కూడా హైడ్రాకు ఇస్తుందా? హైడ్రా కూల్చివేతలు చేపడుతుంటే నాయకులు చూస్తూ ఊరుకుంటారా? ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సమాధానం చెప్పాలేమో..