Hydra: హైదరాబాద్‌లో హైడ్రా దూకుడుతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తంది. ఇప్పటికే 200 ఎకరాలకుపైగా కబ్జా అయిన చెరువులు, కుంటల భూమికి విముక్తి కల్పించింది. బాధితులు కోర్టును ఆశ్రయిస్తున్నా.. కోర్టు తీర్పు వచ్చేలోగా కట్టడాలు నేలమట్టం అవుతున్నాయి. అయితే తాజాగా హైడ్రా చట్టబద్ధతనే ప్రశ్నిస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ప్రభుత్వానికి, హైడ్రాకు నోటీసులు జారీచేసింది. హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆక్రమణలు కూల్చడాన్నీ కోర్టు తప్పు పట్టింది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పందించారు. హైడ్రాకు త్వరలో చట్ట బద్ధత వస్తుందని తెలిపారు. క్యాబినెట్ ఆమోదిస్తుందని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతారని వెల్లడించారు. రంగనాథ్ చెప్పింది నిజం కాబోతోంది.
20న కేబినెట్ భేటీ..
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 20న జరుగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బీఆర్ అబేద్కర్ సచివాలయంలో కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగగిన నష్టంపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పరిహారంపైనా చర్చించే అవకాశం ఉంది. నిధుల కేటాయింపు.. పరిహారం ఏ జిల్లాకు ఎంత ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. ధరణి స్థానంలో కొత్తగా తెచ్చే భూమాత పోర్టల్‌పై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. మూసీ ప్రక్షాళనపైనా చర్చిస్తారని సమాచారం. బీసీ కులగణనపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
హైడ్రాకు చట్టబద్ధత..
ఇక కీలకమైన హైడ్రాకు చట్టబద్ధత, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో బిల్డింగ్ అనుమతులు, ఎన్‌వోసీ జారీలో హైడ్రాను భాగస్వాములను చేయడం వంటి విషయాలపైనా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైడ్రాకు ఇప్పుడు ఉన్న అధికారాలతోపాటు కొత్తగా మరిన్ని అధికారాలు కల్పిస్తారని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వంద పంచాయతీల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.