Collector Sandeep Kumar Jha: గత కొంతకాలంగా సిరిసిల్ల కలెక్టర్ మీద భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ఎప్పుడు సిరిసిల్ల వెళ్ళినా సరే.. తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేటీఆర్ అనుచర వర్గం కూడా ఆ కలెక్టర్ మీద అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్లలో అడ్డగోలుగా అక్రమాలు జరిగాయని.. ఆ అక్రమాలను ప్రస్తుత సిరిసిల్ల కలెక్టర్ బయట పెడుతున్నారని.. రేవంత్ అందుకోసమే ఆయనను సిరిసిల్ల పంపించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేటీఆర్ ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. ఆయన అనుచరులు ఏ స్థాయిలో మండిపడినప్పటికీ అక్కడి కలెక్టర్ మాత్రం తన శైలిని మాత్రం మార్చుకోలేదు. వాస్తవానికి కేటీఆర్ అనుచరులు చేసిన అక్రమాలను బయటికి తీసే క్రమంలో ఆయన అదే దూకుడు కొనసాగించి ఉంటే బాగుండేది. కానీ ఓ నిర్వాసితురాలి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు ఏకంగా హైకోర్టు దాకా వెళ్ళింది. ఆయనకు మాత్రమే కాదు.. ప్రభుత్వానికి కూడా మొట్టికాయలు పడేలా చేసింది.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల ఆయన మిడ్ మానేరు నిర్వాసితురాలు వనభట్ల కవిత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆయనకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. పైగా ఆర్డీవో, ఎమ్మార్వోకు చెప్పి కేసులు నమోదు చేయించారు. దీంతో కవిత మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. అయితే గతంలో ఇదే పిటిషన్ మీద హైకోర్టుకు సందీప్ కుమార్ హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన వేసుకున్న డ్రెస్ పట్ల హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టుకు వచ్చే ప్రొసీడింగ్ తెలియదా.. కోర్టుకు వచ్చే విధానం ఇదేనా అంటూ కలెక్టర్ మీద హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.
కవిత మరొకసారి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. ఈసారి హైకోర్టు న్యాయమూర్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో బాధితురాలికి పరిహారం ఇవ్వాలని ఇచ్చిన తీర్పును యధావిధిగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వానికి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి హైకోర్టు సూచించింది. అంతేకాదు కలెక్టర్ ను చూస్తే భయం వేస్తోందని.. ఆయన డ్రెస్సింగ్ సెన్స్ బాగోలేదని.. ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఎలా సేవ చేస్తారని హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. వాస్తవానికి ఇటీవలి కాలంలో ఒక కలెక్టర్ మీద ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి. కేటీఆర్, ఆయన అనుచరులు అక్రమాలు వెలుగులోకి తేవాలని సందీప్ కుమార్ ని పంపిస్తే.. రేవంత్ లక్ష్యం నెరవేరకపోగా.. పైగా హైకోర్టు నుంచి చివాట్లు ఎదురయ్యాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.