Heavy Rains in Kamareddy: కామారెడ్డిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కనివిని ఎరుగని స్థాయిలో కురుస్తున్న వర్షాల వల్ల విపరీతమైన వరద వస్తున్నది. ఇప్పటికే ఈ ప్రాంతంలో చెరువులకు గండ్లు పడ్డాయి. పంట పొలాలు సర్వనాశనమయ్యాయి. గ్రామాలకు గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలను కోల్పోయాయి. రోడ్లు నామరూపాలు లేకుండా పోయాయి. నష్టం వందల కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే వరద బాధితులను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. కొన్ని ప్రాంతాలలో వరదలు చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు కామారెడ్డిలో కీలకమైన పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తోంది.
లక్ష క్యూసెక్కుల వరద
వరద నీరు భారీగా రావడంతో పోచార ప్రాజెక్టుకు కనివిని ఎరుగనిస్తాయిలో నీరు వస్తోంది. బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న అత్యంత భారీ వర్షాలకు ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద వస్తోంది. పోచారం ప్రాజెక్టును 70 వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు 1,15,825 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పోచారం గ్రామంలో ఉంది. ఇది నాగిరెడ్డిపేట మండల పరిధిలో ఉంటుంది. కామారెడ్డి, మెదక్ పట్టణాల మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంటుంది. పోచారం ప్రాజెక్టును 1916లో మొదలుపెట్టారు. 1922లో పూర్తి చేశారు.. ఈ ప్రాజెక్టు మంజీరా నది మీద ఉంది. గోదావరి పరివాహ ప్రాంతంలో వచ్చే వరద నీరు ఆధారంగా ఈ ప్రాజెక్టును అప్పట్లో నిర్మించారు.
అందువల్లే ఈ తిప్పలు
ఈ ప్రాజెక్టుకు ఈ స్థాయిలో ఎన్నడూ వరద రాలేదు. అయితే మంగళవారం నుంచి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న రాజంపేట మండలంలో గడచిన 14 గంటల్లో ఏకంగా 49 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు అక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షపాతం 55 సెంటీమీటర్ల నుంచి 60 సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 2023లో భూపాలపల్లి జిల్లాలో 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.. కామారెడ్డి జిల్లాలో ప్రతి మండలంలో విపరీతమైన వర్షం కురవడం వల్లే పోచారం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద వస్తుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రాజెక్టు గేట్ల పైనుంచి వరద వెళ్లడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రాజెక్టు దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెబుతున్నారు. అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన వరద బాధితుల కోసం తాత్కాలిక వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఆ వసతి గృహాలలోకి వరద బాధితులను తరలిస్తున్నారు.