Indiramma Illu New Rules: తెలంగాణలో పేదల సొంత ఇంటి కల సాకారం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సొంత స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు, స్థలం లేనివారికి స్థలం కేటాయించి ఇళ్లు నిర్మిస్తామని తెలిపింది. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రేవంత్‌రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రారంభించింది. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఇసుక కొరత, ధరల భారం కారణంగా నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు కూడా ఇప్పిస్తోంది. తాజాగా పథకంలో మరో నూతన మార్పులు తీసుకొచ్చింది. 60 చదరపు గజాల కంటే తక్కువ భూమి ఉన్న పట్టణ నివాసులకు జీ+1 (గ్రౌండ్ ప్లస్ వన్ ఫ్లోర్) నిర్మాణానికి అనుమతి మంజూరు చేసింది. నగరాల్లో స్థలాభావం నేపథ్యంలో చిన్న స్థలాల్లో గృహావసరం నెరవేర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త ప్రమాణాలు ఇలా..
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ఇల్లు కనీసం రెండు గదులను, కిచెన్, బాత్రూమ్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలి. నిర్మాణం సాంకేతిక మార్గదర్శకాల ప్రకారం ఉండేలా సంబంధిత అధికారుల పర్యవేక్షణలో సాగించాలి. జీ+1 నమూనా గృహాలు భవిష్యత్తులో విస్తరణకు అనుకూలంగా రూపకల్పన చేయబడతాయని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు.
ఆర్థికసాయం దశల వారీగా..
ప్రభుత్వం కొత్త మోడల్‌లో ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతల్లో విడుదల చేయనుంది. మొదటి విడత గ్రౌండ్‌ఫ్లోర్ ప్రారంభానికి రూ.లక్ష, రెండో విడత ఫౌండేషన్, గోడల పూర్తి తర్వాత మరో రూ.లక్ష, మూడో విడతలో ఫస్ట్‌ఫ్లోర్ నిర్మాణానికి రూ.2 లక్షలు, నాలుగో విడత తుది పనులు ముగిసిన తర్వాత రూ.లక్ష మంజూరు చేస్తారు. ఈ విధానం ద్వారా మొత్తం రూ.5 లక్షల సహాయం లభిస్తుంది. నిర్మాణం నిర్దేశిత నిబంధనల ప్రకారం సాగితే నిధుల విడుదల వేగంగా జరుగుతుందని సమాచారం.
పట్టణ ప్రజలకు ఊరట..
నగరాల్లో స్థలాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, చిన్న స్థలాల్లో డబుల్ ఫ్లోర్ గృహాలు నిర్మించుకునే అవకాశాన్ని కల్పించడం మిడ్‌ల్ క్లాస్ కుటుంబాలకు పెద్ద ఉపశమనం అవుతోంది. పథకం అమలుతో లక్షలాది పట్టణ గృహాలకు శాశ్వత నివాస భద్రత ఏర్పడనుంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తెచ్చిన ఈ నూతన మార్పులు పట్టణ ప్రణాళికలో సుస్థిరమైన పరిష్కారంగా నిలుస్తున్నాయి. స్థల పరిమితుల మధ్య కూడా గృహ కల నెరవేర్చే ప్రయత్నంగా దీనిని భావిస్తారు.