KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేకుండా పోయింది. మేము కష్టపడి అన్నీ తీసుకొస్తే ఏమాత్రం సోయి లేకుండా రద్దు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి మకుటమైన ఫార్ములా_ ఈ రేస్ తీసుకువస్తే ప్రభుత్వం తరఫున సౌకర్యాలు కల్పించకుండా ఏకపక్షంగా రద్దు చేశారు. ఇదే కదా మొన్న కేటీఆర్ మాట్లాడింది. ఇలానే కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించింది. కానీ అందులో అనేక బొక్కలు ఉన్నాయని..ఆ రేస్ అనేదే పెద్ద మాయాజాలమని ఈరోజు ఆంధ్రజ్యోతి రాసింది. ఎన్నికల సమయంలో కోడ్ ఉన్నప్పటికీ కూడా ఓ అధికారి అత్యంత చొరవ తీసుకొని ఏకంగా 54 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును ముందస్తుగా చెల్లించాడట. దీనికి మంత్రి అనుమతి లేకుండానే, క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండానే, ముఖ్యమంత్రి ఓకే చెప్పకుండానే డబ్బులు వెంటనే ఇచ్చేసాడట. ఓహో డబ్బులు 54 కోట్లు ఇచ్చారు కాబట్టి.. పైగా తనకు అత్యంత సన్నిహితుడు కాబట్టి.. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒంటి కాలు మీద లేస్తున్నాడా.. అందుకేనా ఈ_ రేస్ ను వెనకేసుకొస్తున్నది..
అసలు ఈ ఫార్ములా _ ఈ రేస్ ను హైదరాబాద్ నడిరోడ్డులో నిర్వహించడం.. అప్పట్లో నగరవాసుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవడం.. అప్పటి అధికార మీడియా దీన్ని కొట్టి పారేయడం చకచకా జరిగిపోయాయి. అంతేకాదు నమస్తే తెలంగాణ అయితే అప్పట్లో ఈ ఫార్ములా రేస్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని.. హైదరాబాద్ చరిష్మా బీభత్సంగా పెరిగిపోయిందని.. దీనంతటికీ కేటీఆర్ నాయకత్వమే కారణమని రాస్కొచ్చింది. సగటు హైదరాబాద్ ప్రజల బాధలను ప్రతిబింబించలేదు కాబట్టే.. జనాలను ఇబ్బంది పెడుతూ నడిరోడ్డు మీద ఈ కార్ల రేసు నిర్వహించారు కాబట్టే.. రాష్ట్రంలో కారు పార్టీ బోల్తా కొట్టింది. నిజానికి ఇలాంటి రేసు వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో అప్పటి ప్రభుత్వ పెద్దలే సెలవియ్యాలి. పోనీ ఈ రేస్ లో తెలంగాణ వారు ఎవరైనా ఉన్నారా? పోనీ పోటీలో వారు ఎవరైనా గెలిచారా? గెలిస్తే తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? అనే ప్రశ్నలకు కేటీఆర్ అండ్ కు వద్ద సమాధానం లేదు. పైగా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అధికారి ఒకరు ఎన్నికల సమయంలోనే ప్రభుత్వానికి తెలియకుండా ఏకంగా 54 కోట్ల రూపాయలను ఈ ఫార్ములా రేస్ నిర్వాహకులకు బదిలీ చేయడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంటే ఆ అధికారి వచ్చేసారు కూడా ఈ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని భావించాడా? లేక ప్రభుత్వ పెద్దలు నాకు అత్యంత సన్నిహితులు కాబట్టే.. నేను ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తారని భావించాడా? ప్రభుత్వ అనుమతి లేకుండా 54 కోట్ల రూపాయలను ఒక సంస్థకు బదిలీ చేయడం.. అది కూడా ఇన్ని రోజులకు వెలుగు చూడటం నిజంగా విస్మయకరమే. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసి రోడ్లు మొత్తం గుల్ల గుల్ల అయితే పట్టించుకోని ప్రభుత్వం.. నడుము లోతులోకి నీళ్లు వచ్చి హాహాకారాలు చేసిన ప్రజలను పట్టించుకోని అధికారులు.. ఒక ప్రైవేట్ సంస్థకు మాత్రం దర్జాగా 54 కోట్లు ఇవ్వడం ఏ బంగారు పాలనకు నిదర్శనమో గత పాలకులు చెప్పాలి. ఇన్ని లోపాలు కనిపిస్తుంటే.. ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తుంటే.. కేటీఆర్ కి ఇవన్నీ తెలియదా? లేక తెలిసి కూడా మౌనంగా ఉన్నారా?

ఇలా 54 కోట్ల రూపాయలు అడ్డగోలుగా ఫార్ములా ఈ రేస్ కు తరలించారు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారిగా మేల్కొంది. అప్పుడు జరిగిన వ్యవహారాన్ని తవ్వి తీయడం మొదలుపెట్టింది. ఇందులో ఒక హెచ్ఎండిఏ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రమేయం ఉండటంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా సిఎస్ శాంతి కుమారి ఆ ఆధికారికి ఘాటుగా లేఖ రాశారు. ఈ రేస్ రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తే.. ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు ఒంటి కాలు మీద లేచారు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే ఆ 54 కోట్ల రూపాయలను వెంటనే తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఘాటుగా లేఖ రాసింది. అంతేకాదు గతంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసులో ఓ ప్రైవేట్ కంపెనీ ఉండగా.. ఇప్పుడు దాన్ని కాదని 54 కోట్ల రూపాయలు చెల్లించి ఓ అధికారి ప్రభుత్వం మీద భారం వేయడాన్ని ప్రస్తుత పాలకులు తప్పుపడుతున్నారు. ఫార్ములా ఈ రేస్ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.. మొత్తానికి ఫార్ములా ఈ రేస్ రద్దు తో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలని చూసిన భారత రాష్ట్ర సమితికి.. ఆంధ్రజ్యోతి కథనం కారు కింద రాయి లాగా మారింది. మరి దీనికి మరి దీనికి రేపటి నమస్తే తెలంగాణలో ఎలాంటి కౌంటర్ వస్తుందో వేచి చూడాల్సి ఉంది.