KCR : తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ అపర చాణక్యుడిగా పేరుపొందారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. భారత రాష్ట్ర సమితి కొన్ని జిల్లాలలో ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది.. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, పాలమూరు జిల్లాల్లో ఒక స్థానాన్ని కూడా సాధించలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ భారత రాష్ట్ర సమితికి ఒక స్థానం కూడా దక్కలేదు. చివరికి కెసిఆర్ కు సొంత జిల్లాలుగా పేరుపొందిన కరీంనగర్, మెదక్ లోనూ వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఇక భారత రాష్ట్ర సమితి టికెట్ మీద గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి తెలివిగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత విధించాలని కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఆ నిర్ణయాన్ని అసెంబ్లీ స్పీకర్ పరిధిలోకి తీసుకెళ్లింది. దీంతో భారత రాష్ట్ర సమితి ఒకింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మూడు దశల్లో ఈ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నది. అయితే అనతి కాలంలోనే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందని.. అది స్థానిక ఎన్నికల్లో కనిపిస్తుందని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది. కానీ ఈ దశలోనే ఆ పార్టీకి వెన్నెముకగా ఉన్న రిటైర్డ్ ప్రొఫెసర్.. వెళ్ళిపోతున్నారు. కష్ట కాలంలో విదేశాలకు ప్రయాణమవుతున్నారు..
20 ఏళ్లకు పైగా సేవ
హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి భవన్ ఇన్చార్జిగా ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతున్నారు. 20 సంవత్సరాలకు పైగా ఆయన ఆ సేవలో ఉన్నారు. గతంలో శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీగా పని చేశారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో శ్రీనివాస్ రెడ్డి ఒకరు. అయితే శ్రీనివాస్ రెడ్డి సుదీర్ఘకాలం భారత రాష్ట్ర సమితి కార్యాలయ ఇన్చార్జిగా ఉన్నారు. కెసిఆర్ ఎలాంటి సమాచారం కావాలన్నా ఆయన చిటికెలో అందించేవారు. భారత రాష్ట్ర సమితి కార్యాలయంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ ముందుగా కలిసేది శ్రీనివాసరెడ్డినే. శ్రీనివాస్ రెడ్డికి, కెసిఆర్ కు మధ్య అత్యంత సాన్నిహిత్యం ఉంది. అయితే శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు విదేశాలలో స్థిరపడ్డారు. ఆయన పిల్లలు విదేశాలలో కీలక ఉద్యోగాలు చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డికి కూడా వయోభారం రావడంతో.. ఆయన తన పిల్లల దగ్గరికి వెళ్ళడానికి ప్రణాళికల రూపొందించుకున్నారు. ఇందులో భాగంగానే భారత రాష్ట్ర సమితి కార్యాలయ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వాస్తవానికి ప్రస్తుతం భారత రాష్ట్రపతి కష్ట కాలంలో ఉన్న నేపథ్యంలో.. శ్రీనివాస్ రెడ్డి విదేశాలకు వెళ్లిపోవడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఎమోషనల్ వీడియోను వారు పంచుకుంటున్నారు. కాగా, బీఆర్ఎస్ భవన్ ఇంచార్జ్ పదవి నుంచి తప్పకుండా నేపథ్యంలో.. శ్రీనివాస్ రెడ్డి తన సతీమణితో కలిసి ఎర్రవల్లి వెళ్లారు. అక్కడ కెసిఆర్ ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డిని కెసిఆర్ ఆలింగనం చేసుకున్నారు. శాలువా కప్పి, మెడలో ఒక బంగారు లాకెట్ వేశారు. కెసిఆర్ సతీమణి శ్రీనివాస్ రెడ్డి భార్యకు బొట్టుపెట్టి, చీర బహూకరించారు. ఆ తర్వాత కెసిఆర్ శ్రీనివాస్ రెడ్డిని గేటు దాకా సాగనంపారు. స్వయంగా కారు ఎక్కించి తిరుగు పయనమయ్యారు. అయితే భారత రాష్ట్ర సమితి కార్యాలయ ఇన్చార్జిగా త్వరలో ఎవరిని నియమిస్తారనేది ఉత్కంఠ గా మారింది.
20 సంవత్సరాల పాటు భారత రాష్ట్ర సమితి కార్యాలయ ఇన్చార్జిగా పని చేసిన మాజీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోతున్నారు..ఈ నేపథ్యంలో ఆయనను కెసిఆర్ సన్మానించారు. #BRSParty #KCR #exprofessorSrinivasReddy pic.twitter.com/Mc4CQdhUNT
— Anabothula Bhaskar (@AnabothulaB) November 28, 2024