Site icon OkTelugu

Drunk Driving Vehicle Seizure Rule: మందుబాబులకు గొప్ప గుడ్ న్యూస్ .. డ్రంకెన్ డ్రైవ్ పై పోలీసులకు షాక్

Drunk Driving Vehicle Seizure Rule

Drunk Driving Vehicle Seizure Rule

Drunk Driving Vehicle Seizure Rule: దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అతివేగం ప్రధాన కారణం అయితే.. మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్‌ లేకుండా వామనాలు నడపం తర్వాతి కారణాలుగా ఉన్నాయి. దీంతో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని పోలీసులు నియంత్రిస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తూ.. తాగిన తర్వాత వాహనాలు నడుపకుండా చర్యలు తీసుకుంటున్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే వాహనం సీజ్‌ చేస్తున్నారు. అయితే తాగి నడిపారనే కారణంతో పోలీసులు వాహనాలను స్వాధీనం (సీజ్‌) చేసుకునే అధికారం లేదని తాజాగా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల పేరుతో వాహనాలను పోలీస్‌ స్టేషన్లకు తరలించడం చట్టవిరుద్ధమని, ఇకపై ఈ అత్యుత్సాహం సాగదని న్యాయస్థానం హెచ్చరించింది. మందుబాబులకు ఇది గుడ్‌ న్యూస్‌ అయినప్పటికీ, చట్టపరమైన జరిమానా మాత్రం తప్పదని కోర్టు తేల్చి చెప్పింది.

వాహన సీజింగ్‌ పై నిషేధం
డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు కానీ, వాహనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించకూడదని జస్టిస్‌ వేణుగోపాల్‌ ధర్మాసనం పునరుద్ఘాటించింది. చాలా సందర్భాల్లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పేరుతో వాహనాలను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్లలో పెట్టడం వల్ల వాహనాలు పాడవుతున్నాయని, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.

పోలీసులకు దిశానిర్దేశం..
పోలీసులు సొంతంగా పెట్టుకున్న నిబంధనలు చెల్లవని కోర్టు స్పష్టం చేసింది. డ్రైవర్‌ ఒక్కడే ఉండి, బండి నడపలేని స్థితిలో ఉంటే.. పోలీసులు వెంటనే అతని బంధువులు లేదా స్నేహితులకు సమాచారం అందించాలి. వారు వచ్చి వాహనాన్ని తీసుకెళ్లేలా చూడాలని ఆదేశించింది. వాహనంలో ఉన్న మరొకరికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండి, వారు మద్యం సేవించకుండా ఉంటే.. వారికి వాహనాన్ని అప్పగించి పంపేయాలని తెలిపింది. ఎవరూ లేని పక్షంలో వాహనాన్ని క్షేమంగా పార్క్‌ చేయించాలే తప్ప, చట్టవిరుద్ధంగా సీజ్‌ చేయకూడదని ఆదేశించింది.

పోలీసుల అత్యుత్సాహంపై చురకలు
గతంలో కూడా హైకోర్టు ఇవే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో పోలీసులు వాహనాలను సీజ్‌ చేస్తూనే ఉన్నారు. ఈ అత్యుత్సాహంపై కోర్టు మండిపడింది. పోలీసు శాఖ తమ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని, లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఒకవేళ పోలీసులు నిబంధనలు అతిక్రమించి బండిని సీజ్‌ చేస్తే.. వాహనదారులు ఈ హైకోర్టు తీర్పును ఆధారంగా చూపుకుంటూ న్యాయం పొందవచ్చు. వాహన సీజింగ్‌ వల్ల కలిగే నష్టానికి పోలీసులను బాధ్యులను చేయవచ్చు.

గత నిబంధనల అమలు లేదు..
నిజానికి తెలంగాణలో ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉంది. మోటార్‌ వాహన చట్టం ప్రకారం, మద్యం సేవించి వాహనం నడపడం నేరమే కానీ, దానికి శిక్షగా వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదు. అయినప్పటికీ, అమలులో లోపం కారణంగా పోలీసులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజా తీర్పుతో పోలీసులు తమ తీరు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పు అంటే మద్యం తాగి బండి నడపమని కాదు. తాగి దొరికితే చట్టపరమైన జరిమానా కట్టాల్సిందే. మోటార్‌ వాహన చట్టం సెక్షన్‌ 185 ప్రకారం, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు. రెండోసారి దొరికితే రూ.15 వేల జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కేవలం ఆ సాకుతో వాహనాన్ని లాక్కోవడం మాత్రమే రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.

ఈ తీర్పుతో వాహనదారులు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేయాలని ప్రయత్నిస్తే, హైకోర్టు తీర్పును గుర్తుచేసి నిలదీయవచ్చు. అయినప్పటికీ, మద్యం సేవించి వాహనం నడపకపోవడమే ఉత్తమం. తాగి డ్రైవ్‌ చేయడం వల్ల ప్రాణాపాయ సంఘటనలు జరుగుతున్నాయని, ఇతరుల ప్రాణాలతో పాటు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టినట్లు అవుతుందని గుర్తించాలి.

Exit mobile version