TS Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి ఫలితం వెలువడింది. 11:30 గంటలకు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం కౌంటింగ్ పూర్తయింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు. సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థిపై 28 వేల ఓట్ల మెజారిటీతో బోణీ కొట్టారు.
కొనసాగుతున్న కాంగ్రెస్ అధిపత్యం..
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. మొత్తం పది నియోజకవర్గాలకు గాను తొమ్మిదింటితో కాంగ్రెస్ మొదటి నుంచి ఆధిక్యం కనబరుస్తోంది. ఒకస్థానంలో సీపీఐ ఆధిక్యంలో ఉంది. తొలి విజయం అశ్వారావుపేట విడుదలైంది. మరికొన్ని నిమిషాల్లో భద్రాచలం కౌంటింగ్ కూడా పూర్తికానుంది. ఇక్కడ సీపీఐ అభ్యర్థిగా కూనంనేని కాంగ్రెస్ మద్దతులో సాంబశివరావు పోటీ చేస్తున్నారు.
తెలంగాణలో మెజారిటీ మార్కు దాటిన కాంగ్రెస్..
ఇక తెలంగాణలో ఆధిక్యంతో కాంగ్రెస్ మెజారిటీ మార్కును దాటింది. మ్యాజిక్ ఫిగర్‌కు 60 స్థానాలు అవసరం కాగా, కాంగ్రెస్ 65 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. దాదాపు ఆధిక్యం ఉన్న అన్నిస్థానాల్లో మంచి మెజారిటీతోనే అభ్యర్థులు ఉన్నారు. కాస్త అటూ ఇటూ అయినా 60 స్థానాలు ఖాయంగా కనిపిస్తోంది. ఇక బీఆర్‌ఎస్ 35 నుంచి 40 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ట్రెండ్స్ పూర్తిగా కాగ్రెస్‌వైపే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతున్నాయి. దీంతో గాంధీ భవన్‌లో సంబరాలు కొనసాగుతుండగా, గులాబీ భవన్ వెలవెలబోతోంది.