Congress Rally: రాజకీయాలంటే విమర్శలు, ప్రతి విమర్శలు.. నువ్వు కోట్లు తిన్నావంటే, నువ్వు భూములు దిగమింగావు.. నువ్వు ఆ పార్టీ మారావంటే, నీవు ఆయనతో సన్నిహితంగా ఉన్నావు.. ఇలానే ఉంటున్నయ్.. రాజకీయం అంటే అస్తమానం తిట్లేనా? ప్రజా సమస్యలు కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం జరుగుతోందా? అలా జరగకనే కదా అధికార పక్షం రెచ్చిపోయేది. పోలీసులతో కేసులు పెట్టించేది. ఇన్నాళ్లకు తత్వం బోధపడిందో? లేక తాను వదిలేసుకున్న ప్రతిపక్ష పాత్రను మళ్ళీ మెడలో వేసుకుందో? కారణాలు తెలియవు గాని.. కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికార పార్టీని ఆలోచనలో పడేసింది. అంతేకాదు కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేకుండా డిఫెన్స్ లో పడేసింది.
నిన్న అంటే సోమవారం ఖమ్మంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీని నిరసిస్తూ నిరుద్యోగ ర్యాలీ పేరుతో ఒక బహిరంగ సభ నిర్వహించారు. మల్లు భట్టి విక్రమార్క లాంటి నేత లేకపోయినప్పటికీ సుమారు 20 వేల దాకా జనం వచ్చారు. వాస్తవానికి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఎక్కువ కాబట్టి జనం స్వచ్ఛందంగానే తరలివచ్చారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పెద్ద హంగూ ఆర్భాటం ఏమీ చేయకుండా విహెచ్ హనుమంతరావు లాంటి వారిని పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను జనాలకు అర్థమయ్యేలాగా చెప్పారు. పార్లమెంట్ మాజీ సభ్యురాలు రేణుక చౌదరి వేదికపైకి ఎక్కకుండానే కింది నుంచి మాట్లాడారు. మొత్తానికి సభ సూపర్ సక్సెస్ అయింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు జనం ఈ స్థాయిలో రావడం ఇదే ప్రథమం. అయితే రేవంత్ రెడ్డి ఈసారి యువతను ఎక్కువగా ఆకర్షించే ప్రయత్నం చేశారు. వారిని దృష్టిలో పెట్టుకొని,వారి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని నమ్మకం వారిలో కలిగించారు.
ఆయన మాట్లాడుతున్నంత సేపు భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి చేస్తున్న తప్పులపై విమర్శలు చేశారు. ఈ సభలో పూర్తి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, వచ్చిన జనాలను ఆలోచనలో పడేసింది ఒక చిన్నపాటి సంస్మరణ కార్యక్రమం. అది ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించి ఉండదు. ఎందుకంటే 2014 నుంచి 2023 ఏప్రిల్ వరకు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆత్మహత్యలు, హత్యలు, దాని వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దల దాష్టీకాన్ని నిరసిస్తూ మృతుల ఫోటోలతో ఒక చిన్న పాటి సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ నుంచి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్య వరకు.. ప్రతి సంఘటనను ఉటంకిస్తూ.. కుర్చీలలో ఆయా మృతుల చిత్రపటాల ఉంచి నివాళులు అర్పించింది. వీటిపై పెద్దగా కామెంట్లు చేయకపోయినప్పటికీ.. జనాలకు అర్థమయ్యేలా చేసింది. ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వాస్తవానికి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినప్పటికీ ఈ తరహా కార్యక్రమం చేపట్టలేదు. అయితే ఇటీవల భారతీయ జనతా పార్టీ పెద్దలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా భారత రాష్ట్ర సమితి నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన ప్రదర్శిస్తున్నారు.. వారికి కౌంటర్ ఇవ్వడం బిజెపి నాయకులకు చేతకావడం లేదు. కానీ యాదృచ్ఛికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత రాష్ట్ర సమితికి ఈ తరహా కౌంటర్ ఇవ్వడం మాత్రం ఇదే ప్రథమం.