CM Revanth Reddy: గ్రామాల్లో వార్డు మెంబర్ అయితేనే ఎంతో పెద్ద హడావిడి చేస్తూ ఉంటారు. పట్టణంలో అయితే కౌన్సిలర్ గా గెలిస్తే ఎమ్మెల్యేగా ఫోజు కొడుతుంటారు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి భార్య అయితే ఎంతటి రేంజ్ ఉండాలి? ఏ స్థాయిలో హడావిడి చేయాలి? భారీగా కాన్వాయ్, భద్రత కల్పించే పోలీసులు, పక్కనే ఉండే వ్యక్తిగత సిబ్బంది..అబ్బో ఆ హంగామా మాములుగా ఉండదు. కానీ అవి ఆమె పెద్దగా కోరుకోవడం లేదు. పెద్దగా బయటకు రావడం లేదు. ఏదో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం అయితేనే బయటికి వస్తున్నారు. అది కూడా కొంతసేపే ఉంటున్నారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంతకీ ఎవరు ఆమె? అంత సింపుల్ గా ఎలా ఉంటున్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
సుదీర్ఘ పోరాటం తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రి అయ్యారు. మడమ తిప్పని పోరాటం చేసి పది సంవత్సరాల పాటు అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితిని ఓడించారు. దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని మరొకసారి నిరూపించారు. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ తన పోరాట పటిమ ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే పాలనలో తన మార్కు పనితీరును ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించిన ఆరు హామీల అమలుకు కసరత్తు ప్రారంభించారు. మంత్రివర్గ కూర్పు లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అత్యంత చాకచక్యంగా శాసనసభను నడిపించారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను వివరాలతో సహా శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నారు. సహజంగానే రేవంత్ రెడ్డికి దూకుడు ఎక్కువ. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అన్ని విషయాల్లో సమయమనం పాటిస్తున్నారు. చివరికి కుటుంబం విషయంలో కూడా అదే తీరును అవలంబిస్తున్నారు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పాలనలో ఆయన కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువగా ఉండేది. చివరికి ఆయన మనవడు కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అయితే దానివల్ల ఆయన చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు 2023 లో జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోయేందుకు అది కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు. అయితే భారత రాష్ట్ర సమితి చేసిన తప్పును తాను చేయకూడదని భావించిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ పాలన వ్యవహారంలో తన కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ కానివ్వడం లేదు. అంతేకాదు తన సతీమణి గీతను కూడా పెద్దగా బయటకు తీసుకురావడం లేదు. ప్రమాణ స్వీకార సందర్భంగా సోనియా గాంధీ ఆశీర్వాదాన్ని రేవంత్ రెడ్డి దంపతులు తీసుకున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సతీమణి పెద్దగా ఏ కార్యక్రమంలోనూ కనిపించలేదు. ఇటీవల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఇచ్చిన విందులో ఆమె కనిపించారు. ఆ తర్వాత కొంతసేపు అక్కడ ఉండి వెంటనే వెళ్లిపోయారు. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని విధానాలు పాటించాల్సి ఉంటుంది కాబట్టి.. రేవంత్ రెడ్డి గీతారెడ్డి విషయంలో అత్యంత జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ఫోకస్ చేయకుండా ఉండేందుకు ఆమెను పెద్దగా బయటకు తీసుకురావడం లేదని సమాచారం.
గీతారెడ్డి తో ఇంటర్వ్యూ చేసేందుకు పలు మీడియా సంస్థలు పోటీపడుతున్నప్పటికీ ఆమె సున్నితంగా నిరాకరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆమె బయటికి వస్తే మీడియా మొత్తం ఫోకస్ చేస్తుంది కాబట్టి.. ఎక్కడ ఏ చిన్న లూప్ లైన్ దొరికినా ప్రతిపక్ష పార్టీలు గోరంతల కొండంతలు చేస్తాయి కాబట్టి.. అలాంటి అవకాశం ఇవ్వకూడదని రేవంత్ రెడ్డి భావించినట్టు తెలుస్తోంది. అందుకే గీతారెడ్డిని అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రమే తీసుకొస్తున్నట్టు సమాచారం. కాగా గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ సతీమణి అప్పుడప్పుడు అధికారిక కార్యక్రమంలో పాల్గొనేవారు. ఇక మన రాష్ట్రానికి పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల సతీమణులు బాగా ఫేమస్ అయ్యారు. తమ భర్తలు ముఖ్యమంత్రులు అయిన తర్వాత మరింత గుర్తింపు పొందారు. అయితే వారందరికీ విరుద్ధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండడం విశేషం.