CM Revanth Reddy: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వాటిని అమలు చేస్తామని ప్రకటించింది. అధికారం చేపట్టి వంద రోజులు కావొస్తుండడంతో గ్యారంటీల అమలును వేగవంతం చేసింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించారు. మార్చి 1 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్ అందించే హామీలు అమలు చేశారు. ఇక కీలకమైన మరో గ్యారంటీని మార్చి 11 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మార్చి 11న ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
మార్గదర్శకాలపై సమీక్ష
ఈనెల 11న ప్రారంభించే ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో మాట్లాడారు. అర్హులందరికీ లబ్ధి కలిగేలా విధి విధానాలు తయారు చేయాలని సూచించారు. పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించారు. ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ప్రాధాన్యమివ్వాలన్నారు. సీఎస్ శాంతికుమారి, ఆర్‌అండ్‌బీ మరఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నియోజకవర్గానికి 3500 ఇళ్లు..
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. దశల వారీగా నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరుస్తామన్నారు. ఇక ఇదే పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో ఇల్లు నిర్మిచునేలా రూ.5 లక్షలు ఇస్తామన్నారు. ఇక, ఇల్లు లేని పేదలకు స్థలం, ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థికసాయం చేస్తామని తెలిపారు. నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వివిధ ఇంటి నమూనాలు
ఇక ఇందిరమ్మ పథకంలో మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టుకునేవారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని సీఎం సూచించారు. లబ్ధిదారులు సొంత ఇంటిని తమకు నచ్చినట్లుగా కట్టుకున్నా అందులో టాయిలెట్, వంటగది కచ్చితంగా ఉండేలా చూడాలని సీఎం సూచించారు. ఇళ్ల నిర్మాణాను పర్యవేక్షించే బాధ్యతను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించాలని తెలిపారు.