CM Revanth Reddy: బహిరంగ సభలలో ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నప్పుడు కాస్త సమయమనం పాటించాలి. బాధ్యతగల పదవిలో ఉన్నారు కాబట్టి వారు ఆ స్థాయిలో విజ్ఞతను ప్రదర్శించడం చాలా అవసరం. కానీ, నేటి కాలంలో రాజకీయ నాయకులు అలా వ్యవహరించడం లేదు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. చివరికి ఏం మాట్లాడుతున్నారో.. ఎలా మాట్లాడుతున్నారో.. అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరిపోయారు. ఇలా అనడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పడం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో ఓ మంత్రిపై ఎన్ టీవీ నిరాధారమైన కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనం కాస్త తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. వాస్తవానికి ఇలాంటి కథనాన్ని ఎన్టీవీ ఎలా ప్రసారం చేసిందో అర్థం కావడం లేదు. అయితే దీని వెనుక ఒడిశా ప్రాంతంలోని నైనీ బ్లాక్ వ్యవహారం ఉందని వేమూరి రాధాకృష్ణ కుండబద్దలు కొట్టారు. తన పత్రిక ఆంధ్రజ్యోతిలో సంచలన విషయాలను రాశారు. రాధాకృష్ణ రాసిన రాతలు కాస్త తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. దీంతో ఎన్టీవీ కూడా గట్టిగానే కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. కాకపోతే నేరుగా కాకుండా.. పరోక్షంగా రాధాకృష్ణ మీద విమర్శలు చేయడం ప్రారంభించింది.
ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. దీంతో నేరుగానే ఆయన స్పందించారు. వేమూరి రాధాకృష్ణ, ఎన్టీవీ నరేంద్ర చౌదరిని ఆంబోతులతో పోల్చారు. తమ ప్రభుత్వంలో పని చేస్తున్న మంత్రులను లేగ దూడలుగా పేర్కొన్నారు. ఆంబోతుల మాదిరిగా పోట్లాట పెట్టుకుంటే లేక దూడల కాళ్లు విరుగుతాయని.. అటువంటి వ్యవహారాలకు పాల్పడవద్దని సూచించారు రేవంత్ రెడ్డి.. ఇటువంటి పరిణామాలు పునరావృతమైతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
రేవంత్ చేసిన వ్యాఖ్యలకు గులాబీ నాయకులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా వేమూరి రాధాకృష్ణ ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లారని .. ఆంబోతు అని తెలిసినప్పటికీ కూడా రేవంత్ రాధాకృష్ణ ఇంటికి ఎందుకు వెళ్లారని గులాబీ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో నరేంద్ర చౌదరిని కూడా రేవంత్ రెడ్డి కలిశారని గుర్తు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే స్థాయిలో గులాబీ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి రేవంత్ చేసిన వ్యాఖ్యల ఫలితం తెలంగాణలో బీభత్సమైన చర్చకు కారణమవుతోంది. మరి దీనికి ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో చూడాల్సి ఉంది.
ABN రాధాకృష్ణ, NTV చౌదరీలను ఆంబోతులతో పోల్చిన రేవంత్ రెడ్డి
ఆంబోతులు తన్నుకుంటే లేగ దూడల కాళ్లు విరిగినట్టు ఉంది మీడియా ఛానళ్ల వ్యవహారం
అంబోతుల లాంటి రెండు మీడియా ఛానళ్లు కొట్టుకుని, లేగ దూడల్లాంటి మా మంత్రులను, ఎమ్మెల్యేలను బలి చేయకండి
మీకు మీకు ఏమన్న గొడవలుంటే తలుపులు… pic.twitter.com/zh4j893bU5
— Telugu Scribe (@TeluguScribe) January 18, 2026
