CM Revanth Reddy: ఇచ్చింది 12 గంటలే..కేసీఆర్ కరెంటు గుట్టు విప్పిన రేవంత్

తెలంగాణ విద్యుత్ శాఖ పనితీరుపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా పలు విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.. తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రంలో సాగుకు రోజుకు 12 గంటలు మాత్రమే కరెంటు ఇచ్చారు..

Written By: Anabothula Bhaskar, Updated On : December 9, 2023 10:55 am

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తెలంగాణలో ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితి నాయకులు పవర్ పాలిటిక్స్ చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అంధకారంలోకి నెడుతుందని ప్రచారం చేశారు. వారికి బలం ఇచ్చేలాగా తానా మహాసభల్లో రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అని వ్యాఖ్యానించారు. ఇంకేముంది భారత రాష్ట్ర సమితి నాయకులు చెలరేగిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పరిపాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పారు. అయితే తానా సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. అధికార భారత రాష్ట్ర సమితి తన సొంత మీడియాలో, సొంత పార్టీ నాయకులతో కౌంటర్ ఇవ్వడం ప్రారంభించింది. అయితే ఇదే అదునుగా రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ పనితీరును తవ్వడం మొదలు పెట్టారు. అయితే అప్పట్లోనే వ్యవసాయానికి రాష్ట్రం ఇస్తోంది 12 గంటలు అని తేలింది. చాలా ప్రాంతాల్లో సబ్ స్టేషన్ లలో కీ_ బుక్ లను దాచింది. అంతేకాదు కరెంటు గురించి ఏ వివరం కూడా బయటకు చెప్పొద్దని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ వివరాల ఆధారంగానే రేవంత్ రెడ్డి తిరిగి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కరెంటు గుట్టు విప్పుతానని ఆ రోజే శపధం చేశారు. అన్నట్టుగానే ఆ కరెంటు గుట్టు విప్పడం ప్రారంభించారు.

12 గంటలే ఇచ్చారట

తెలంగాణ విద్యుత్ శాఖ పనితీరుపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా పలు విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.. తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రంలో సాగుకు రోజుకు 12 గంటలు మాత్రమే కరెంటు ఇచ్చారు.. అంతేకాదు విద్యుత్ సంస్థల అప్పులు 81,516 కోట్లకు చేరుకున్నాయని వివరించారు. అంతేకాదు రాష్ట్ర విద్యుత్ సరఫరా స్థాపిత లోడ్ సామర్థ్యం 19,475 మెగా వాట్లు కాగా.. ఇప్పటిదాకా 15,497 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు అయిందని అధికారులు ప్రకటించారు.. మార్చి 14న అత్యధికంగా 297.89 యూనిట్లను సరఫరా చేశామని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలు మొత్తం పూర్తయితే 16, 701 మెగా పట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుందని వివరించారు.

అప్పుల భారం

ఇక విద్యుత్ సంస్థలను అప్పుల భారం వేధిస్తోంది. 2014 జూన్ నాటికి ట్రాన్స్ కో 2,411 కోట్ల అప్పుల్లో ఉంది.. 2023 అక్టోబర్ 31 నాటికి ఆ భారం 10,136 కోట్లకు చేరుకుంది. జెన్కో సంస్థకు 2014 జూన్ నాటికి 7,662 కోట్ల అప్పు ఉంటే.. 2023 అక్టోబర్ 31 నాటికి అది 31,923 కోట్లకు చేరుకుంది. దక్షిణ డిస్కంకు 2014 జూన్ నాటికి 8,213 కోట్ల అప్పు ఉంటే.. 2023 అక్టోబర్ 31 నాటికి అది 21,041 కోట్లకు చేరుకుంది. ఉత్తర డిస్కం పై 2014 జూన్ నాటికి 4137 కోట్ల భారం ఉంటే 2023 అక్టోబర్ 31 నాటికి అది 15,416 కోట్లకు చేరుకుంది. మొత్తంగా 2014 జూన్ నాటికి ఈ విద్యుత్ సంస్థల అన్నింటిపై 22,423 కోట్ల భారం ఉంటే 2023 అక్టోబర్ 31 నాటికి అది 81, 516 కోట్లకు చేరుకుంది. అయితే విద్యుత్ శాఖ పనితీరుపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడంతో ఇన్నాళ్లు భారత రాష్ట్ర సమితి చేసుకున్న ప్రచారం మొత్తం అబద్ధమని తేలిపోయింది. మొన్నటిదాకా జెన్కో సిఎండిగా పనిచేసిన దేవులపల్లి ప్రభాకర్ రావు తో సమీక్ష నిర్వహిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని ఆ శాఖ అధికారులు అంటున్నారు. అయితే ఈ శాఖలో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేస్తే కాంగ్రెస్ ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు పెద్ద కష్టం కాదని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.