Medaram Natural Disaster: అప్పటిదాకా భూమికి పచ్చని రంగు అద్దినట్టు ఉన్న అడవి ఒక్కసారిగా కకావికలం అయిపోయింది. చూస్తుండగానే హోరుగాలులు భీకరమైన శబ్దం చేశాయి. ఒకచోట పుట్టిన గాలి మొత్తం వ్యాపించింది. చెట్లు విరిగిపోయాయి. భీకరమైన వర్షం కురిసింది. ఆ గాలి జోరుకు ప్రాంతం మొత్తం తన రూపురేఖలను మొత్తం కోల్పోయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపు పెను ఉత్పాతం చోటుచేసుకుంది. ఒకవేళ అక్కడ మనుషులు గనుక ఉండి ఉంటే ప్రాణ నష్టం తీవ్రంగా జరిగి ఉండేది.
విపరీతమైన నష్టం
సరిగ్గా గత ఏడాది ఆగస్టు 31న మేడారంలో చోటు చేసుకున్న టోర్నడో వల్ల అడవి మొత్తం నాశనమైంది. అదే ఏడాది భూకంపం కూడా రావడంతో అక్కడ నష్టం మరింత తీవ్రంగా జరిగింది. వాస్తవానికి క్లౌడ్ బరస్ట్ అని ఇప్పుడు చెప్పుకుంటున్నాం గానీ.. గత ఏడాది మేడారం ప్రజలకు ఇది అనుభవంలోకి వచ్చింది. ప్రకృతి విపత్తు వల్ల ఏకంగా 332 హెక్టార్లలో అడవి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు ఇదే తీరైన నష్టం ఉత్తర భారత దేశంలో చోటు చేసుకుంటున్నది. గత ఏడాది చోటుచేసుకున్న క్లౌడ్ బరస్ట్ మాదిరిగానే.. అక్కడ కూడా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా ప్రాంతాలలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. నష్టం కూడా అత్యంత తీవ్రంగా ఉంది. వరదల వల్ల చాలావరకు గృహాలు ధ్వంసమయ్యాయి. వేలాదిమంది కట్టుబట్టలతో మిగిలారు.
జంతువులు వెళ్లిపోయాయి
మేడారంలో ఆ స్థాయిలో హోరు గాలులు రావడానికి కారణమేమిటో ఇప్పటికీ తెలియ రాలేదు. కాకపోతే ఈ ప్రమాదాని కంటే ముందు ఒకరోజు జంతువులు పెద్ద ఎత్తున అరుపులు అరిచాయి. అంతేకాదు ఆ ప్రాంతం నుంచి అవి వెళ్లిపోయాయి. జింకలు.. కొండెంగలు.. కోతులు.. దుప్పులు.. కొన్ని రకాల పక్షులు.. నక్కలు విపరీతమైన శబ్దాలు చేసుకుంటూ వెళ్లిపోయాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇంతవరకు ఆ ప్రాంతానికి ఆ జంతువులు రాలేదు. దీనిని బట్టి ఇంకా ఆ ప్రాంతంలో ఏమైనా జరుగుతుందా.. భూకంపం లాంటిది సంభవిస్తుందా.. టోర్నడో మళ్లీ విరుచుకు పడుతుందా.. అనే భయాలు జంతువుల్లో ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇటీవల శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని సందర్శించి.. జరిగిన ప్రమాదానికి కారణం ఏమిటి… అనే విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు. కాకపోతే మేడారం చరిత్రలో ఈ స్థాయిలో టోర్నడో ఎన్నడూ రాలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. మరోవైపు గత ఏడాది ఆ ప్రాంతంలో భూకంపం కూడా చోటుచేసుకుంది. భూమిలో ప్రకంపనలు చోటు చేసుకోవడంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.