BRS Media: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రాజకీయ పార్టీకి అధికారికంగా, అనధికారికంగా మీడియా సంస్థలు ఉన్నాయి. ఇందులో భారత రాష్ట్ర సమితికి టీ న్యూస్, నమస్తే తెలంగాణ మౌత్ పీస్, కరపత్రంగా వ్యవహరిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు భజన చేసి.. ఇప్పుడేమో క్షుద్రపాత్రికేయాన్ని ప్రదర్శిస్తున్నాయి. సరే వాటి యజమాని లక్ష్యాలకు అనుగుణంగా అవి పని చేస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ప్రజల్లో లేనిపోని ఆందోళనలు సృష్టించడం.. ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం.. అనవసరైన విషయాలలో ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేయడంలో ఆ రెండు సంస్థలు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా జరిగిన ఓ సంఘటన పై వ్యాఖ్యలకు బలం చేకూర్చుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఈ యూరియా కొరత ఉన్నదనే మాట వాస్తవం. అయితే కేంద్రం నుంచి వస్తున్న యూరియాను రైతుల అవసరాలకు తగ్గట్టుగా క్రమ పద్ధతిలో ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రైతులకు టోకెన్లు మంజూరు చేస్తూ.. వాటి ఆధారంగా యూరియా అందిస్తోంది. కొన్ని ప్రాంతాలలో మాత్రం యూరియా సక్రమంగా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. వాస్తవానికి యూరియా అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. పైగా ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పంట విస్తీర్ణం పెరిగింది. ముఖ్యంగా వరి సాగు ఎక్కువైంది. ఈ నేపథ్యంలో యూరియాకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా తయారీ నిలిచిపోవడంతో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా తెలంగాణలో రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితులను కలగజేశాయి.
క్షేత్రస్థాయి పరిస్థితి ఇలా ఉంటే.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి.. రైతుల్లో ఆందోళనలు పెంచడానికి టీ న్యూస్, నమస్తే తెలంగాణ కంకణం కట్టుకున్నాయి. రైతులలో ఆందోళనలు పెంచడానికి నడుము బిగించాయి. తాజాగా తెలంగాణలో ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండల కేంద్రంలో యూరియా పంపిణీ సక్రమంగా జరుగుతున్నప్పటికీ.. కేవలం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే యూరియా ఇస్తున్నట్టు వాయిస్ ఇవ్వాలని కొంతమంది రైతులను టీ న్యూస్ ప్రతినిధి ఒత్తిడి చేశారు. దానికి ఆ రైతులు ఒప్పుకోలేదు. టీ న్యూస్ ప్రతినిధి అంతకంతకు ఒత్తిడి తీసుకురావడంతో ఆ రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చివరికి యూరియా పంపిణీ పూర్తయిన తర్వాత.. ఈ విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకువచ్చారు. పకడ్బందీ ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు టీ న్యూస్ ప్రతినిధి, కెమెరామెన్, మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తెగ ప్రసారం చేస్తోంది. ప్రభుత్వం సక్రమంగా యూరియా పంపిణీ చేస్తున్నప్పటికీ ఇలా లేనిపోని ఆబాండాలు వేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.