BRS KTR Kavitha Rift: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. అధికారంలో ఉన్నంతకాలం పార్టీలో ఎలాంటి లుకలుకలు బయటపడలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్ ముఖ్యమైన మంత్రి, హరీశ్ అన్నీ తెలిసిన మంత్రిగా, కవిత ఓల్ అండ్ సోల్‌గా ఉన్నారు. మొత్తంగా కుటుంబ పాలన సాగించారు. అయితే అధికారం కోల్పోగానే పార్టీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార పార్టీలోకి చేరారు, ఇక కవిత ఇటీవల ‘‘డీయర్ డాడీ’’ అంటూ రాసిన లేఖ కుటుంబంలో కుంపటి పెట్టింది. అధికారంలో ఉన్నంతకాలం ఎంతో ప్రేమ ఉన్నట్లు కనిపించిన అన్నా, చెల్లెలు కేటీఆర్–కవిత ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇందుకు కారణం డీయర్ డాడీ లేఖనే. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కవితను పార్టీకి దూరం పెట్టేశారు. అధినేత కేసీఆర్ కూడా మౌనంగా ఉంటున్నారు. దీంతో కవిత కూడా తన జాగృతిని యాక్టివేట్ చేస్తున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో జోక్యం చేసుకుంటున్నారు. అయితే తాజాగా అన్న కేటీఆర్ చెల్లి కవితకు మరో షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. కల్వకుంట్ల కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న టీబీజీకేఎస్‌లో చర్చనీయాంశమైంది.
Also Read: Telangana Politics : కాంగ్రెస్ పై వ్యతిరేకత.. బీఆర్ఎస్ పై నో అనుకూలత.. బీజేపీ సోదిలో లేదు
కవితకు షాక్ ఇచ్చేందుకేనా..
కొప్పుల ఈశ్వర్ సీనియర్ నాయకుడు. అంతకన్నా ముందు సింగరేణి కార్మికుడు. ఆయనకు కోల్‌బెల్ట్‌పై మంచి పట్టు ఉంది.. రాజకీయ అనుభవంతోపాటు కార్మిక సంఘాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. సంఘం కార్యకలాపాలను బలోపేతం చేయడంతోపాటు కవితను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించేందుకే కేటీఆర్ ఈ నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది. కొప్పుల నియామకంతో కవితను యూనియన్‌కు పూర్తిగా దూరం పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె యూనియన్ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటోంది. అదే సమయంలో పార్టీని విమర్శిస్తోంది. పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతోంది.
సింగరేణిలో కీలకం..
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కోల్‌బెల్ట్ విస్తరించి ఉన్న ఏడు జిల్లాల్లో చాలా కీలకంగా ఉంది. కార్మికులు సభ్యత్వం కలిగి ఉన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో రెండుసార్లు వరుసగా గుర్తింపు సంఘంగా గెలిచింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ యూనియన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. గెలుపులో కీకలపాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల నాటికి యూనియన్‌ను యాక్టివ్ చేయడంతోపాటు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇటు కవిత, అటు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు.
అయితే ఈ నియామకం, సంఘంలో అధికార విభజనను స్పష్టం చేసేందుకు లేదా కొత్త దిశగా నడిపించేందుకు ఉద్దేశించినట్లు తెలుస్తోంది.