KCR: బీఆర్ఎస్ కు బిగ్ షాక్ : కేసీఆర్ కు నోటీసులు

విద్యుత్‌ ఒప్పందాలపై మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు అర్వింద్, ఎస్‌కే.జోషి, సురేశ్‌ చందా, అజయ్‌ మిశ్రా సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ నరసింహారెడ్డి తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : June 11, 2024 4:45 pm

KCR

Follow us on

KCR: ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అంతకన్నా ఘోర పరాభవంతో చతికిల బడిన తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు నోటీసులు అందాయి. ఆయన సీఎంగా ఉన్న సమయంలో విద్యుత్‌ కొనుగోళ్లు, ఒప్పందాలకు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి. ‘విద్యుత్‌ కొనుగోళ్లలో మీ పాత్ర ఏమిటి’ అని పవర్‌ కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. 2024, జూన్‌ 30వ తేదీ లోపు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ఒప్పందాలపై అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్‌ పాత్రపై కమిషన్‌ అనుమానాలు వ్యక్తం చేసింది. లోగుట్టుపై ఉన్న సందేహాలకు కేసీఆర్‌ సమాధానం చెప్పాలని కమిషన్‌ పేర్కొంది.

25 మందికి నోటీసులు..
విద్యుత్‌ ఒప్పందాలపై మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు అర్వింద్, ఎస్‌కే.జోషి, సురేశ్‌ చందా, అజయ్‌ మిశ్రా సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ నరసింహారెడ్డి తెలిపారు. జూన్‌ 15 వరకు తాము వివరణ కోరామని, కేసీఆర్‌ గడువు కోరడంతో జూన్‌ 30 వరకు పెంచామని తెలిపారు.

స్పందించిన బీఆర్‌ఎస్‌..
పవర్‌ కమిషన్‌ నోటీసులపై బీఆర్‌ఎస్‌ నేతలు స్పందించినట్లు తెలుస్తోంది. జూన్‌ 30వ తేదీలోపు సమాధానం ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈమేరకు కేసీఆర్‌ గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఈమేరకు అధికారుల నుంచి పూర్తి సమాచారం తెప్పించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జూన్‌ 30 వరకు కాకుండా జూలై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్‌ కమిషన్‌ను కోరారు.

వివరణ సంతృప్తికరంగా లేకుంటే..
కేసీఆర్‌ ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోయినా.. అసంపూర్తిగా ఉన్నా.. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించినా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈమేరకు తాజా నోటీసుల్లో కమిషన్‌ స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పూర్తి వివరాలతో సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు కేసీఆర్‌కు నోటీసులు అందడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ, కేసీఆర్‌ తనయ కవిత తిహార్‌ జైల్లో ఉన్నారు. మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ క్రమంలో విద్యుత్‌ ఒప్పందాలకు సంబంధించిన నోటీసులు రావడంత కలవర పెడుతోంది .

పక్క చూపులు చూస్తున్న నేతలు..
బీఆర్‌ఎస్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండడంతో ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడి అధికార కాంగ్రెస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి, తాజా నోటీసుల నేపథ్యంలో మరికొందరు అధికార కాంగ్రెస్‌తోపాటు, కేంద్రమో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. కేసీఆర్, కేటీఆర్‌ అరెస్ట్‌ అయితే పార్టీకి భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో పార్టీ వీడేందకు చాలా మంది సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.