https://oktelugu.com/

KCR : తరతమ బేధం లేదు.. కేసీఆర్ అంటే ఏపీలో చెప్పాల్సిందే.. ఇదీ లెక్క

కేసీఆర్ టీడీపీలో ఉన్నా తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నించారు. తెలంగాణ బాగు పడాలంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరొక దారి లేదని బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన అనితర సాధ్యుడు కేసీఆర్.

Written By: , Updated On : February 17, 2025 / 09:38 PM IST
KCR

KCR

Follow us on

KCR : కేసీఆర్.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. దశాబ్ధాలుగా రాజకీయాల్లో తన మార్కు చూపుతున్న మహానేత. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక నాయకుడు కాదు, నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగంగా మారిపోయాడు. కేసీఆర్ సహా తెలంగాణ వాదులు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆంధ్ర పాలకుల పార్టీల్లో పని చేశారు. కేసీఆర్ టీడీపీలో ఉన్నా తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నించారు. తెలంగాణ బాగు పడాలంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరొక దారి లేదని బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన అనితర సాధ్యుడు కేసీఆర్.

తన రాజకీయ రంగ ప్రవేశం 1981 లోనే చేశారు కేసీఆర్. ఆయన మొదట యువజన కాంగ్రెస్ నేతగా పని చేశారు. ఆ తరువాత సంవత్సరమే ఎన్టీఅర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో అందులో చేరి 1983లో టికెట్ సాధించి సిద్దిపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటికి కేసీఆర్ కు కేవలం 29ఏళ్లు మాత్రమే. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.. కానీ ఓటమితో కుంగిపోలేదు. తిరిగి 1985లో మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత తను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా 1989, 1994, 1999లలో ఏకంగా నాలుగు సార్లు నిర్విరామంగా ఎమ్మెల్యేగా గెలిచారు.

నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన క్యాబినెట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు డిప్యూటీ స్పీకర్ పదవి లభించింది. దీంతో కాస్త అసహనం వ్యక్తం చేసి 2000లో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. 2021లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఇక అక్కడ నుంచి కేసీఅర్ ఓ ఉద్యమ నాయకుడిగా అవతరించారు. రాముడి అరణ్య వాసం మాదిరి 14ఏళ్ల ఆయన చేసిన పోరాటం కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఆ తర్వాత రెండు సార్లు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణాను కొట్లాడి తెచ్చిన నేతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

ఇక 2004 నుంచి 2014 మధ్యలో కేసీఆర్ కేంద్రంలో కూడా మంత్రిగా కొన్నాళ్ల పాటు పని చేశారు. కేసీఆర్ నేడు పుట్టిన రోజు జరుపుకున్నారు. నేటితో ఆయనకు 71ఏళ్లు నిండి 72వ ఏట అడుగుపెట్టారు. మరో మూడేళ్లలో తెలంగాణకు ఎన్నికలు ఉంటాయి. మరోసారి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 75ఏళ్ల వయసులో అచ్చం ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబులా మూడో సారి సీఎం అవుతారు. కేసీఅర్ ని రాజకీయంగా ఎంతలా విభేదించినా ఆయనతో స్నేహబంధాన్ని అందరూ కోరుకుంటారు. ఆయనకు అందరూ ఆప్తులే. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విడదీసిన అక్కడ కూడా ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది.

అందుకు నిదర్శనమే నేడు ఏపీకి చెందిన బడా నేతలంతా శుభాకాంక్షలు తెలపడం.. కూటమి ప్రభుత్వంలోని పెద్దలతో పాటు.. ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీ నుంచి కూడా గ్రీటింగ్స్ రావడం విశేషం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ జననేత కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ అధినేత జగన్ కూడా కేసీఅర్ కి గ్రీట్ చేశారు.. దీనిని చూసిన వారు అంతా ఏపీలో యునానిమస్ గా కేసీఅర్ కి గ్రీటింగ్స్ దక్కాయని కామెంట్స్ చేస్తున్నారు. కేసీఆర్ విషయంలో అంతా ఏకాభిప్రాయంతోనే ఉన్నారని తెలుపుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు కేసీఆర్ గతంలో సహచరుడిగా పనిచేశారు. టీడీపీలో 18 ఏళ్లకు పైగా పనిచేశారు. కేసీఅర్ ఉద్యమ శైలి, తన ఉక్కు సంకల్పం అంటూ పవన్ కు అమితమైన గౌరవం. కేసీఅర్ స్నేహితుడుగా శ్రేయోభిలాషిగా జగన్ ఉంటారని అంటారు. మొత్తానికి ఏపీలో అధికార విపక్షాలు ఒకరినొకరు దూషించుకున్నా కేసీఅర్ విషయంలో మాత్రం ఏకతాటి పైకి రావడం ఆశ్చర్యకరంగా ఉంది.