
రేవంత్ రెడ్డికి తెలంగాణ అధ్యక్ష పదవి ఇస్తే తాను పార్టీలో ఉండనని మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనికి రారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేకి అయిన రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే మేం జైలు చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త అధ్యక్ష పదవికి ఎవరికి ఇవ్వాలనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఇటీవల అభిప్రాయాలను సేకరించిన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మానిక్కం ఠాగూర్ అధ్యక్ష పదవి లిస్టును అధిష్టానం వద్ద ఉంచారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.