UIDAI new Aadhaar app: ఆధార్.. భారత్‌లో విశిష్ట గుర్తింపు కార్డు ఇదే. అయితే ఈ కార్డును చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకుల నుంచి నగదు దోచేస్తున్నారు. అంఘిక శక్తులు ఈ ఆధార్‌ను ఉపయోగించి తీవ్ర నేరాలకు పాల్పడుతున్నాయి. ఈ తరునంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ఆధార్ దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. తాజాగా ఆధార్ వినియోగాన్ని మరింత చొరవతో, సులువుగా మార్చేందుకు కొత్త మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డు ప్రతీసారి వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, విపులమైన డిజిటల్ సౌకర్యం లభించనుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్‌లో, ఐఫోన్ యూజర్లు యాపిల్ స్టోర్‌లో ఈ యాప్‌ను ఉచితంగా పొందవచ్చు.
అందుబాటులోకి డిజిటల్ ఆధార్..
ఈ కొత్త యాప్ ప్రధానంగా పేపర్లెస్ ఆధార్ వినియోగానికి దారితీస్తుంది. పాత ఎం ఆధార యాప్‌తో పోలిస్తే ఇందులో అధిక ఫీచర్లు లేవు కానీ గోప్యత, సమయ సౌలభ్యం ఉంటుంది. మీ ఆధార్ వివరాలను స్మార్ట్‌గా ఫోన్‌లో ఉంచుకోవడం, అవసరమైనప్పుడు ఇతరులకు భద్రంగా పంచుకోవడం ఈ యాప్ లక్ష్యం. కొత్త ఆధార్ యాప్ ప్రత్యేకతల్లో ఒకటి కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను ఒకే ఆప్షన్‌తో సేకరించుకునే అవకాశం. దీనివల్ల వృద్ధులు లేదా పిల్లల ఆధార్ కార్డులు మరిచిపోయే సమస్య తగ్గుతుంది. అవసరమైనప్పుడు ఒక్క యాప్ నుంచే వారి వివరాలను చూపించవచ్చు.
ఫేస్ అథెంటికేషన్‌తో అధిక భద్రత
యూజర్ గుర్తింపుకు ఫేస్ అథెంటికేషన్ కొత్త రక్షణగా ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా బయోమెట్రిక్ సరిపోలికతో యాప్ యాక్సెస్ మెరుగుపడుతుంది. అదనంగా బహుళ స్థాయి పిన్ సెక్యూరిటీ సదుపాయం కూడా ఉంది. ఈ యాప్‌తో వినియోగదారుడు తన ఆధార్ వివరాల్లో ఏ సమాచారం పంచుకోవాలనుకుంటున్నాడో, దానిని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఆధార్ నంబర్, ఫొటో లేదా చిరునామా లాంటి అంశాలను వేర్వేరు ఎంపికలుగా పంచుకోవచ్చు. దీంతో గోప్యతాపరమైన నియంత్రణ పూర్తిగా యూజర్ చేతుల్లో ఉంటుంది.
బయోమెట్రిక్ లాక్..
సైబర్ భద్రత నేపథ్యంలో యూఐడీఏఐ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. వినియోగదారులు తమ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడం లేదా తాత్కాలికంగా తెరవడం చేయగలరు. ఈ ఫీచర్ వల్ల అనధికార వినియోగం తగ్గుతుంది. యాప్‌లోని ట్రాకింగ్ ఫీచర్ ద్వారా ఆధార్ వివరాలు చివరిసారిగా ఎప్పుడు, ఎక్కడ వినియోగించబడ్డాయో తెలుసుకోవచ్చు. ఇది ఆధార్ దుర్వినియోగాన్ని గుర్తించడంలో ఉపయోగపడుతుంది.
వినియోగం ఇలా..
యాప్ ఇన్‌స్టాల్ చేసిన తరువాత పర్మిషన్లను అంగీకరించి, ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. తర్వాత ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేసి పిన్ సెట్టింగ్ తర్వాత యాప్ వినియోగం ప్రారంభమవుతుంది. ఈ యాప్ డిజిటల్ సౌలభ్యం, గోప్యతా భద్రత రెండూ కలిసే కొత్త దశలోకి ఆధార్ ప్రవేశించింది.