Twitter: సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్(పాత ట్విట్టర్) ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి వచ్చాక అనేక సంచలనాలు నమోదు చేస్తోంది. మస్క్ సూచనలతో ఎక్స్‌లో అనేక మార్పులు చేస్తున్నారు. ట్విట్టర్ పిట్టను తొలగించి మొదటి సంచలనం నమోదు చేశారు. తర్వాత దాని పేరు ఎక్స్‌గా మార్చారు. తర్వాత బ్లూటిక్ ఆప్షన్‌లోనూ మార్పులు చేశారు. తర్వాత ఎక్స్‌లో పనిచేస్తున్న సిబ్బందిని కుదించారు. ఇలా అనేక మార్పులు చేర్పులు చేసిన మస్క్ తాజాగా మరో సంచలనానికి సిద్ధమయ్యారు. ఎక్స్‌లో ఇకపై పూర్తి నిడివి సినిమాలు చూసే కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నారు. ఎక్స్ చందాదారులు సినిమాలు, టీవీ సీరియళ్లు పోస్ట్ చేయవచ్చ, వాటిని మానెటైజ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చని మస్క్ ప్రకటించారు.
ఒకేసారి ఫీజు చెల్లించే విధానం..
ఎక్స్‌లో సినిమాలు, సీరియళ్లు పోస్టు చేసే వారు ఒకేసారి ఫీజు చెల్లించే విధానం కావాలని ఎక్స్ కస్టమర్లు సూచించారు. దీంతో ప్రజలు సబ్‌స్రైబ్ చేసుకోకుండానే సినిమాలు కొనుక్కోవచ్చని, అపుపడు ఎక్స్ నిజమైన సినిమా వేదిక అవుతుందని పేర్కొన్నారు. ఎక్స్‌కు మెరుగైన వీడియో ప్లేయింగ్ యంత్రాలు అవసరమని, అది సాకారం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఏఐ ఆడియెన్స్..
ఇదిలా ఉంటే.. ఎక్స్‌లో త్వరలో ఏఐ ఆడియెన్స్ ఫీచర్ కూడా తీసుకు వస్తామని మస్క్ ప్రకటించారు. ఈ ప్రకటనపై కూడా యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలను సరైన యూజర్లకు చేరవేయడమే ఏఐ ఆడియెన్స్ ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రకటనలు ఎవరికి చేరాలని కోరుకుంటున్నారో సంక్షిప్తంగా వివరిస్తే ఏఐ వ్యవస్థలు సెకన్ల వ్యవధిలో వాటిని చేరవేస్తాయని తెలిపారు.