Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీRobots Building Railway Station: తాపీ మేస్త్రీలుగా రోబోలు.. ఏకంగా హైస్పీడ్ రైల్వే స్టేషన్ నే...

Robots Building Railway Station: తాపీ మేస్త్రీలుగా రోబోలు.. ఏకంగా హైస్పీడ్ రైల్వే స్టేషన్ నే నిర్మించాయి..

Robots Building Railway Station: ఆ మధ్య చైనాలో మారథాన్ జరిగింది. మనుషులతో పాటు రోబోలు కూడా ఇందులో పాల్గొన్నాయి. మనుషుల మీద రోబోలు గెలిచాయి. ఆ పోటీలో టాప్ 5 స్థానాలు కూడా రోబోలు సాధించాయి. కేవలం ఆటవిడుపు కోసమో, ఇతర వ్యవహారాల కోసమో రోబోలను కనిపెట్టలేదని, వాటి ఒళ్లు వంచిపని చేయిస్తామని చైనా చెబుతోంది. చెప్పడమే కాదు, చేసి కూడా చూపించింది. చివరికి ప్రపంచంమొత్తం తమ వైపు చూసేలా చైనా చేసింది.

టెక్నాలజీ రంగంలో అమెరికా, జపాన్, ఇజ్రాయిల్, దక్షిణకొరియాకు తిరుగులేదని చాలా మంది అనుకుంటారు. కానీ, ఆ దేశాలు కూడా కుళ్లు కునేలా చేయడంలో చైనా ముందు వరసలో ఉంటుంది. ఏకంగా ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయే విధంగా ఉత్పత్తులు తయారు చేసి.. అదరగొడుతుంది. చైనా టెక్నాలజీ రంగంలో చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా రోబోలను ఉపయోగించి చైనా చేస్తున్న పనులు ప్రపంచానికి కొత్త దారిని పరిచయం చేస్తున్నాయి.

చాలా దేశాలలో ప్రస్తుతం మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. మనుషులు ఒకప్పటి మాదిరిగా పని చేయడం లేదు. యంత్రాల మీద ఆధారపడటం పెరిగిపోయింది. అయితే యంత్రాలు కూడా చేయలేని పనులు రోబోలు చేస్తాయి. ఈ విధానాన్ని చైనా నూటికి నూరుశాతం చేసి చూపించింది. రోబోలను ఏకంగా నిర్మాణరంగంలోకి దించింది. వాటిని తాపీ మేస్త్రీలుగా మార్చింది. కేవలం 38 నెలల్లో చాంగ్ కింగ్ ఈస్ట్ హై స్పీడ్ రైల్వే హబ్ నిర్మించింది. ఇందుకోసం భారీగా రోబోలను వినియోగించింది.

నాలుగు సంవత్సరాల క్రితం చాంగ్ కింగ్ లోని నాన్స్ జిల్లాలో రైల్వే స్టేషన్ పనులు షురూ అయ్యాయి. 2025 జూన్ లో రైల్వే స్టేషన్ ప్రారంభమైంది.మొత్తం 12.1 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైల్వే స్టేషన్ నిర్మించారు. హై స్పీడ్ రైళ్లు, మెట్రో రైళ్లు, బస్సులు, ట్యాక్సీలు, అనేక రకాల ప్రయాణ సాధనాలకు ఇది కేరాఫ్ అడ్రస్. ఇందులో ఏకంగా 15 ప్లాట్ ఫాంలు, 29 ట్రాక్ లు ఉన్నాయి. గంట వ్యవధిలో 16,000 మంది సేవలు అందించే ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. ఏడాదికి పది కోట్లమంది ఇక్కడి రైల్వే స్టేషన్ లో ప్రయాణిస్తారు. దీనిని స్టీల్, గాజు వంటి పదార్థాలు ఉపయోగించి నిర్మించారు. అందువల్ల ఇక్కడ సహజసిద్దంగానే కాంతి ఉంటుంది.

రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో అనేక కష్టాలు ఎదురయ్యాయి. క్లిష్టమైన వాతావరణం ఇబ్బంది పెట్టింది. అందువల్లే చైనా రోబోలను వాడింది. పనులకు పూర్తిగా లేజర్ గైడెడ్ నాలుగు చక్రాల స్క్రీడ్ రోబోలను వాడారు. లైడార్, ఏఐ, 5జీ టెక్నాలజీని ఉపయోగించారు. కాంక్రీట్ లెవలింగ్ లో అత్యంత కచ్చితత్వాన్ని పాటించారు. మనుషులతో పోల్చి చూస్తే ఏకంగా మూడు రెట్ల వేగంతో రోబోలు పని చేశాయి. కార్మికుల అవసరాన్ని దాదాపు 40 శాతం తగ్గించాయి. రైల్వే హబ్ నిర్మాణంలో ఏకంగా 800 కేజీల గ్లాస్ ప్యానెల్స్ ఉపయోగించారు. ఫలితంగా 90శాతంవరకు ప్రమాద తీవ్రత తగ్గింది. చైనా రోబోలు చేసిన అద్భుతాన్ని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో కోట్లాది వీక్షణలు సొంతంచేసుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version