India data usage per month: ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ కు పేరు ఉంది. అత్యధిక వినియోగదారులున్న మార్కెట్ కూడా మనదేశమే. అందువల్లే ప్రపంచ స్థాయి కార్పొరేట్ కంపెనీలు మన దగ్గర సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్, కెనడా, ఇంకా పెద్ద పెద్ద దేశాలకు చెందిన కంపెనీలు మనదేశంలో సంస్థలు ఏర్పాటుచేసి కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
మన దేశం కూడా ఒకప్పుడు అభివృద్ధిలో ఎక్కడ ఉండేది. అయితే మన దగ్గర కూడా సౌలభ్యాలు పెరిగిపోయాయి. సౌకర్యాలు ఎక్కువైపోయాయి. సాంకేతికత ను ఉపయోగించుకోవడం పెరిగిపోయింది. ఫలితంగా టెక్ పరికరాలను వాడటం ఎక్కువైపోయింది.
స్మార్ట్ఫోన్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత.. డాటా వినియోగం అనివార్యమైన తర్వాత.. చాలామంది ఫోన్ లోనే మునిగి.. తేలుతున్నారు. 5జి సర్వీస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ మొత్తం మారిపోయింది. స్మార్ట్ ఫోన్ యూజర్ల నెలవారి డేటా వినియోగం పెరిగిపోయింది. ప్రముఖ ఫోన్ తయారీ సంస్థ నోకియా నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.
భారత స్మార్ట్ఫోన్ యూజర్ల నెలవారీ డాటా వినియోగం సగటు 31 జిబి కి చేరిపోయింది. 2024లో 27.5 జిబి గా నమోదైతే.. 2025 కు వచ్చేసరికి అది కాస్త 31 జీబీకి పెరిగిపోయింది. మనదేశంలో డాటా వినియోగం ప్రతి ఏడాది 18% పెరుగుతోంది. నోకియా వార్షిక మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇండెక్స్ 13వ విడత నివేదిక ప్రకారం 2025లో దేశాంతంగా నెలవారి 5g డాటా ట్రాఫిక్ ఏకంగా 70% పెరిగింది. అది కాస్త 12.9 ఎక్సా బైట్స్ కు చేరుకుంది. దేశవ్యాప్తంగా డేటా ట్రాఫిక్ 27ఈబిలో 5జి డాటా వాటా 47 శాతానికి పెరిగింది. డేటా ట్రాఫిక్ కూడా గడిచిన ఐదు సంవత్సరాలలో ప్రతి ఏడాది 21.7% చొప్పున పెరిగింది.
ప్రపంచంలో ఐదవతరం డాటాను వినియోగించే వారిలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు. అత్యధిక 5జీ ఫిక్స్ డ్ వైర్లెస్ యాక్సెస్ వినియోగదారులపరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. కాస్మోపాలిటన్ నగరాలలో 5జి డాటా ట్రాఫిక్ 58 శాతం వరకు ఉంది. గత ఏడాది మనదేశంలో యాక్టివ్ 4 జీ ఫోన్ల సంఖ్య 89.2 కోట్ల వరకు ఉండేది. ఇందులో 38.3 కోట్ల ఫోన్లు 5జి సేవల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. గత ఏడాది మార్కెట్ లోకి వచ్చిన ఫోన్లలో 90% 5జీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నవి. 2031 నాటికి మనదేశంలో 5 జీ యూజర్ల వృద్ధి 100 కోట్లకు చేరుకుంటుంది.
