Gemini Nano Banana: నమ్మొదు.. నమ్మొద్దురన్నా.. ఈ ఆడాళ్లనీ అని ఓ సినీ కవి రాశాడు.. మగాళ్లు అంత మాయాగాళ్లు.. నట్టేట్లో ముంచేసి పోతారే.. అంటూ మరో సినీ కవి రాశాడు. మనుషుల పోకడలను బట్టి ఈ పాటలు పుట్టుకొచ్చాయి. కానీ ఇప్పుడు నడుస్తున్నది టెక్నాలజీ కాలం.. మనుషులు.. మనుషుల కన్నా టెక్నాలజీనే ఎక్కువగా నమ్ముతున్నారు. కానీ, ఈ టెక్నాలజీ మనల్ని నట్టేట ముంచేస్తోంది. ప్రస్తుత ఏఐ ట్రెండ్ మన గుట్టు రట్టు చేస్తోంది. తాజాగా గూగుల్ జెమినీకి చెందిన నానో బనానా ఏఐ టూల్ ఓ మహిళ ఒంటిపై పుట్టు మచ్చలను కూడా బయటపెట్టింది. ఈ టూల్ యూజర్ల ఫోటోలను 90ల బాలీవుడ్ స్టైల్‌లో వింటేజ్ సారీ లుక్‌లుగా మారుస్తుంది, చిఫాన్ సారీలు, గోల్డెన్ అవర్ లైటింగ్, సినిమాటిక్ పోజ్‌లతో. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఈ ట్రెండ్‌ను పాటిస్తున్నారు. తమ సెల్ఫీలను ఆకర్షణీయమైన 4కే రెట్రో పోర్ర్‌టెయిట్‌లుగా మలిచి షేర్ చేస్తున్నారు. ఈ ఫీచర్ సృజనాత్మకతకు ఊపందుకుంటూ, యూజర్లకు వినోదాత్మక అనుభవాన్ని అందిస్తోంది.
ఒంటి రహస్యాలు బహిర్గతం..
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఈ ట్రెండ్‌ను ప్రయత్నించినప్పుడు తన ఫొటో చూసి షాక్ అయింది. తాను గ్రీన్ సల్వార్ సూట్‌లో ఉన్న ఫొటోను అప్‌లోడ్ చేసి, సారీ ఎడిట్ కోరిన ఆమెకు వచ్చిన ఇమేజ్ మొదట అద్భుతంగా కనిపించింది. స్లీవ్‌లెస్ ట్రెండీ సారీలో ఆకర్షణీయంగా మారిన ఆ ఫోటోను ఆమె సంతోషంగా షేర్ చేసింది. కానీ తర్వాత, ఆ ఏఐ జెనరేటెడ్ ఇమేజ్‌లో ఆమె ఎడమ చేతిలో ఒక పుట్ట మచ్చ కనిపించడంతో ఆమె ఆశ్చర్యానికి హడావిడి గురైంది. ఒరిజినల్ ఫొటోలో ఫుల్ స్లీవ్‌ల వల్ల ఆ పుట్ట మచ్చ కనిపించలేదు, కానీ ఏఐ అది కచ్చితంగా చూపించింది. ఈ ఘటన ఆమెకు ‘భయంకరమైనది‘ అనిపించి, ఇతర యూజర్లకు హెచ్చరికగా వీడియో షేర్ చేసింది.
ఎలా జరిగింది?
తనకు ఎదరైన అనుభవం ఏఐ టూల్స్ అధ్యయనాత్మక సామర్థ్యాలను హైలైట్ చేస్తుంది. నానో బనానా వంటి మోడల్స్ ఒక్క పొటో మాత్రమే కాకుండా, యూజర్ల గూగుల్ జెమినీ లేదా డ్రైవ్‌లో ఉన్న ఇతర ఇమేజ్‌ల నుంచి డేటాను ఇన్ఫర్ చేయగలవు. ఇది ఫేస్ రికగ్నిషన్, బాడీ మ్యాపింగ్ లేదా ప్యాస్ట్ అప్‌లోడ్‌ల ఆధారంగా వివరాలను జోడించవచ్చు. కానీ ఇది యూజర్‌లకు అజ్ఞాతంగా జరిగినందున, ‘ఎలా తెలిసింది?‘ అనే ప్రశ్నలు లేవనెత్తాయి. నిపుణులు ఇది ఏఐ డేటా ఇంటిగ్రేషన్ వల్లేనని చెబుతున్నారు, కానీ ఇది ప్రైవసీ రూల్స్‌ను పరీక్షిస్తోంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత, ఆమె చేసిన వీడియోకు 7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి, యూజర్ల మధ్య చర్చలు రగిలించాయి. కొందరు దీన్ని ‘అటెన్షన్ సీకింగ్‘గా భావించినప్పటికీ, చాలామంది ఏఐ టూల్స్ డేటా యాక్సెస్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్ జెమినీ లాంటి ప్లాట్‌ఫారమ్‌లు యూజర్‌ల ఫొటోలు, ఈమెయిల్స్ లేదా డ్రైవ్ ఫైల్స్‌ను స్కాన్ చేయవచ్చని కామెంట్లు వస్తున్నాయి. నిపుణులు అప్‌లోడ్ చేసే కంటెంట్‌ను జాగ్రత్తగా పరిశీలించాలని, ప్రైవసీ సెట్టింగ్స్‌ను చెక్ చేయాలని సూచిస్తున్నారు. ఈ ట్రెండ్ వినోదానికి మధ్య, డిజిటల్ భద్రతపై అవగాహన పెరగడం ఒక సానుకూల అంశం.