MS Dhoni : త్వరలో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి స్టార్ స్పోర్ట్స్ ప్రోమో విడుదల చేసింది. ఈ ప్రోమో లో రిషబ్ పంత్, అయ్యర్, రాహుల్, పాండ్యా కనిపించి సందడి చేశారు. దీంతో ఐపీఎల్ పై అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. ఐపీఎల్ ప్రోమో విడుదలై ఒక్కరోజు అయిందో లేదో.. మరో కీలక అప్డేట్ వచ్చింది. అయితే ఈ అప్డేట్ ఇచ్చింది స్టార్ స్పోర్ట్స్ కాదు.. బీసీసీఐ అంతకన్నా కాదు.. టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోని.. “కొత్త సీజన్” కొత్త రోల్” అంటూ అతడు ఫేస్ బుక్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అతడు పోస్ట్ చేయడమే ఆలస్యం చక్కర్లు కొట్టడం మొదలైంది. అతడు పోస్ట్ చేసిన గంటలోపే సుమారు 60,000 మంది దాన్ని లైక్ చేశారు. 7,200 మంది తమ స్పందనలు తెలియజేశారు. ధోని ఆ పోస్ట్ చేసిన నేపథ్యంలో.. దాని వెనుక ఎటువంటి సర్ప్రైజ్ ఉందో నని అభిమానులు బుర్రలు గోక్కుంటున్నారు.
ఈనెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ధోని సారథ్యంలో చెన్నై జట్టు ట్రోఫీ కైవసం చేసుకుంది. ముంబై తర్వాత అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై ఘనత సాధించింది. గత ఏడాది ట్రోఫీ సాధించిన తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చాలామంది అనుకున్నారు. అయితే ధోని అలాంటి ప్రకటన చేయలేదు. పైగా ఈ ఏడాది ఐపిఎల్ లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ధోని ప్రాక్టీస్ ప్రారంభించాడు. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ సీజన్లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ తో బెంగళూరు వేదికగా ఆడనుంది. గత సీజన్ తర్వాత ఇంతవరకు ధోనిని మైదానంలో చూడకపోవడంతో.. అభిమానులు అతడి ఆట తీరు చూడాలని ఎంతో ఆతృతగా ఉన్నారు. మరో మూడు వారాల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోని చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
కొత్త రోల్ అని ధోని పోస్ట్ చేశాడు అంటే… చెన్నై జట్టుకు కోచ్ గా ఉంటాడేమోననే రూమర్ మొదలైంది. ఒకవేళ కోచ్ గా కాకుంటే మెంటర్ గా ఉంటాడేమోనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో కెప్టెన్సీ ని వేరే ఆటగాడికి ఇచ్చి తాను.. జట్టు సభ్యుడిగా కొనసాగుతాడేమోనని కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా న్యూ రోల్ అని తోని పోస్ట్ చేయడంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది.