Virat Kohli: ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం టీమ్ ఇండియా రెడీ అవుతోంది.. జూన్ నెలలో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీం ఇండియా ఇంగ్లాండ్ బయలుదేరి వెళుతుంది. అంతకంటే ముందు ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్ ఆడుతుంది. టి20కి వీడ్కోలు పలికిన నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ లో మాత్రమే ఆడతాడు.. విరాట్ కోహ్లీ కొంతకాలంగా సరైన ఫామ్ కనబరచడం లేదు. టెస్టులలో దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ క్రమంలో తన ఫామ్ కంటిన్యూ చేయడానికి విరాట్ కోహ్లీ దేశవాళి క్రికెట్ (domestic cricket) ఆడనున్నాడు. అందులో తనను తాను నిరూపించుకొని.. టెస్ట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
దేశవాళీ ఆడాల్సిందే
ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడినప్పుడు.. కచ్చితంగా దేశవాళి క్రికెట్ ఆడాలని ఇటీవల బిసిసిఐ నిబంధనలు విధించింది. కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే నిబంధన అమలు చేస్తామని ప్రకటించడంతో ఆటగాళ్లు దేశవాళి క్రికెట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. విరాట్ కోహ్లీ మాత్రమే కాకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దేశవాళి క్రికెట్ ఆడే అవకాశం ఉంది. రోహిత్ శర్మ ఇటీవలి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యాడు. కనీసం రెండు అంకెల స్కోర్ కూడా చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డాడు. సెంచరీల మీద సెంచరీలు కొట్టిన అతడు.. సింగిల్ రన్ తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే విరాట్, రోహిత్ మాత్రమే కాకుండా.. ఫామ్ లేమి తో ఇబ్బంది పడే ఆటగాళ్లు మొత్తం దేశవాళి క్రికెట్ ఆడాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఫామ్ కోల్పోయినప్పుడు కచ్చితంగా దేశవాళి క్రికెట్ ఆడతారని.. టీమిండియా ఆటగాళ్లు కూడా అదే చేయాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు పేర్కొంటున్నారు.. అలా అయితేనే జట్టు విజయాలు సాధిస్తుందని వారు గుర్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా గెలవడానికి కారణం అదేనని.. అందువల్లే ఆ జట్టు వరుస విజయాలు సాధించిందని గుర్తు చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ మోజులో పడి దేశవాళీ క్రికెట్ ఆడకుండా.. దూరంగా ఉంటున్నారని.. దానివల్ల జట్టు విజయాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని.. ఇలాంటి పరిస్థితి మరొకసారి పునారవృతం కాకుండా ఉండాలంటే కచ్చితంగా స్టార్ ఆటగాళ్లు దేశవాళి క్రికెట్ ఆడే విధంగా బిసిసిఐ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వారు పేర్కొంటున్నారు.