ICC Champions trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ఎనిమిది జట్లు తలపడుతున్నాయి. అయితే లీగ్ నుంచి మొదలు పెడితే ఫైనల్ వరకు ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా పోటీలో ఉన్న జట్లు బలంగా ఉండడంతో క్రికెట్ అభిమానులు మ్యాచ్ లపై అత్యంత ఆసక్తిగా ఉన్నారు.. ఛాంపియన్స్ ట్రోఫీలో గతంలో అనేక సంచలనాలు నమోదయ్యాయి. మరి ఈసారి ఆ స్థాయిలో అద్భుతాలు సృష్టించే జట్లకు కొదవలేదు. అయితే గతంలో జరిగిన మ్యాచ్లను ఒకసారి పరిశీలిస్తే..
2017లో న్యూజిలాండ్ కు బంగ్లా చుక్కలు చూపించింది
2017లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి. ఆ రెండు జట్లు అప్పుడు తలపడ్డాయి. న్యూజిలాండ్ జట్టును బంగ్లాదేశ్ ఓడించింది. అదృష్టం కలిసి వచ్చి ఏకంగా సెమీస్ దాకా వెళ్ళిపోయింది. తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో బంగ్లా, న్యూజిలాండ్ కు ఓటమి ఎదురైంది. అనంతరం ఆస్ట్రేలియాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఈ క్రమంలో గ్రూప్ దశలో చివరి మ్యాచ్ కూడా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగింది. అయితే బంగ్లాదేశ్ జట్టును ఓడించాలని చూసిన న్యూజిలాండ్ కు భంగపాటు ఎదురయింది.
ఆస్ట్రేలియాను మట్టికరిపించిన శ్రీలంక
2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు శ్రీలంక షాక్ ఇచ్చింది. గ్రూప్ ఎ లో ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు పరస్పరం తలపడ్డాయి. లంక అత్యంత బలమైన జట్టు కాకపోయినప్పటికీ ప్రపంచ క్రికెట్లో అత్యంత బలంగా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించింది. ఏకంగా సెమీస్ వెళ్ళిపోయింది. అయితే ఇంగ్లాండ్ జట్టుకు కూడా శ్రీలంక షాక్ ఇచ్చింది. నాటి సెమీఫైనల్ లో భారత్ శ్రీలంకను ఓడించింది. ధోని ఆధ్వర్యంలో టీమిండియా 2013 సీజన్లో విజేతగా నిలిచింది.
భారత జట్టుకు షాక్ ఎదురైంది
విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడింది. అద్భుతమైన ఆట తీరుతో ఫైనల్ వరకు వెళ్ళింది. అయితే ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో తడబాటుకు గురైంది. దానికంటే ముందే గ్రూప్ దశలో శ్రీలంక చేతిలో భారత్ కు షాక్ ఎదురైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత భారీ టార్గెట్ ను శ్రీలంక చేరించింది. ముందుగా బ్యాటింగ్ చేస్తున్న టీమ్ ఇండియా 321/6 పరుగులు చేయగా… శ్రీలంక 48.4 ఓవర్లలోనే ఆ టార్గెట్ చేజ్ చేసింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. చివరికి విరాట్ కోహ్లీ కూడా బౌలింగ్ చేయాల్సి రావడం విశేషం.
ఇక ప్రస్తుత టోర్నీలో 8 జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా బలంగానే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుపెడితే బంగ్లాదేశ్ వరకు సంచలనాలు సృష్టించే జట్లుగానే ఉన్నాయి. తమదైన రోజు ఈ జట్లు ఏవైనా చేయగలవు. ఎంతటి అద్భుతాలనైనా సృష్టించగలవు. బుధవారం నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ జట్లు ఎలాంటి అద్భుతాలు చేస్తాయో వేచి చూడాల్సి ఉంది.