Ind Vs Nz 3rd Test: విరాట్ కోహ్లీ నుంచి మొదలుపెడితే రోహిత్ శర్మ దాకా.. భారతీయ ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో సత్తా చాటడం లేదు. న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా టెస్ట్ సిరీస్ కోల్పోవడం వెనుక ప్రధాన కారణం కూడా అదే. స్పిన్ బౌలింగ్ లో దూకుడుగా ఆడలేక భారత ఆటగాళ్లు వికెట్లు సమర్పించుకోవడం ఆవేదన కలిగిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జట్టులో కాస్త మెరుగైన ఇన్నింగ్స్ ఆడగానే.. చాలామంది ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్ ను లైట్ తీసుకుంటున్నారు. ఆమధ్య దేశవాళి క్రికెట్ ను ఆడక పోవడంతో ఈశాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ పై బీసీసీఐ వేటు వేసింది.. ఇదే సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా కు మినహాయింపు ఇచ్చింది. ఇది ద్వంద్వ వైఖరి అని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అయినప్పటికీ మేనేజ్మెంట్ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఈ ముగ్గురికి ఇచ్చిన మినహాయింపు జట్టుకు ఎంతటి స్థాయిలో నష్టం చేకూర్చుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఈ ముగ్గురు ఆటగాళ్లు పెద్దగా ప్రభావం చూపించలేదు. చివరికి మూడో టెస్ట్లో జ్వరం కారణంగా బుమ్రా కు విశ్రాంతి ఇచ్చారు. వాస్తవానికి మొదటి టెస్టులో బుమ్రా కు విశ్రాంతి ఇచ్చి, అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ఆడించి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక విరాట్ 2012, రోహిత్ 2015లో చివరిసారిగా ఉత్తర ప్రదేశ్ జట్టుపై దేశవాళి క్రికెట్ ఆడారు. దేశవాళి క్రికెట్ ఆడటం వల్ల స్పిన్నర్లను ఎదుర్కోవడం ఆటగాళ్లకు సులువు అవుతుంది. ఫుట్ వర్క్ ను మెరుగుపరచుకోవడం తేలిక అవుతుంది. బౌలర్ల యాక్షన్ ను అర్థం చేసుకోవడం వీలవుతుంది.
కమిన్స్ దేశవాళి క్రికెట్ ఆడుతున్నాడు..
త్వరలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాలో జరగనుంది. ఆ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ కమిన్స్ అక్కడ దేశవాళి క్రికెట్ ఆడుతున్నాడు. అక్కడిదాకా ఎందుకు 2013లో టీమిండియా స్టార్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ దేశవాళి క్రికెట్ ఆడాడు. ఆ మ్యాచ్ జరిగింది హర్యానా రాష్ట్రంలోని లాహ్లి వేదికగా.. వాస్తవానికి ఆ రోజుల్లో సరైన సౌకర్యాలు లేవు. స్టార్ ఆటగాడు అయినప్పటికీ సచిన్ దేశవాళి క్రికెట్ ఆడటం.. ఆ తర్వాత తన ఆట తీరు మార్చుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిని బట్టి ఆటగాళ్లకు దేశవాళి క్రికెట్ ఆడటం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. దేశవాళి క్రికెట్ ఆడటం వల్ల స్టార్ ఆటగాళ్లకు గాయాలు అవుతాయని బీసీసీఐ చెబుతున్నప్పటికీ.. అందులో నిజం లేదు.
ఆ మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందే
సీనియర్ ఆటగాళ్లని మినహాయింపు ఇవ్వకుండా.. ప్రతి ఆటగాడు దేశవాళి క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ నిబంధనలు పెట్టాలి. అలా ఆడని ఆటగాళ్లపై కచ్చితమైన చర్యలు తీసుకోవాలి. వీలుంటే సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించాలి. దేశవాళి క్రికెట్ ఆడటం వల్ల ఆటగాళ్లకు రకరకాల బౌలింగ్ లపై అవగాహన ఏర్పడుతుంది. రోజంతా మైదానాన్ని అంటిపెట్టుకొని ఉండటం వల్ల ఫుట్ వర్క్ మెరుగుపడుతుంది. స్పిన్ బౌలింగ్ అంచనా వేయడానికి ఉపకరిస్తుంది.. షాట్ల ఎంపికలో పరిపక్వత వస్తుంది. వన్డే, టి20లతో పోల్చితే టెస్ట్ క్రికెట్లో ఆటగాళ్లకు స్థిరత్వం ఎక్కువగా ఉండాలి. దాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలి. అది జరగాలంటే కచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి. అప్పుడే ఆటగాళ్లు ఎలాంటి బౌలింగ్ నైనా ఎదుర్కోగలరు. విజయాన్ని సాధించగలరు. బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ ముందు దేశవాళి క్రికెట్ టోర్నీలో బీసీసీఐ అనేక మార్పులు చేపట్టింది. అందులో ప్రతిభ చూపిన వారికి అవకాశం ఇస్తానని ప్రకటించింది. అయితే అందులో కొంతమంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రతిభ చూపించినప్పటికీ బీసీసీఐ అవకాశాలు ఇవ్వలేదు. జట్టుకు భారంగా ఉన్న వారిని మళ్లీమళ్లీ ఎంపిక చేస్తూ పరువు తీసుకుంటున్నది. ప్రస్తుతం బుమ్రా, రోహిత్, విరాట్ పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చి ఉంటే న్యూజిలాండ్ సిరీస్ లో ఫలితం వేరే విధంగా ఉండేదని సీనియర్ ఆటగాళ్లు విశ్లేషిస్తున్నారు. డొమెస్టిక్ క్రికెట్ ను వీరి ముగ్గురు ఆడక పోవడం వల్ల.. అది అంతిమంగా జట్టు విజయాలపై ప్రభావం చూపిస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Team india should do this if they want to face the spin bowling
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com