T20 World Cup: అమెరికా – వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో లీగ్ సమరం దాదాపుగా ముగిసినట్టే. అంచనాలకు అందని విధంగా న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్ ఇంటి బాట పట్టాయి. అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ సూపర్ -8 కు చేరుకున్నాయి.. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు ఊహించిన విధంగానే సూపర్ -8 లోకి ప్రవేశించాయి. సూపర్ -8 పోరు జూన్ 19న అమెరికా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ ద్వారా మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఆంటిగ్వా లో జరుగుతుంది. మరుసటి రోజు అంటే జూన్ 20న ఇంగ్లాండ్ – వెస్టిండీస్ జట్లు సెయింట్ లూసియా వేదికగా తలపడతాయి. జూన్ 21న ఆస్ట్రేలియా – బంగ్లాదేశ్ బార్బడోస్ వేదికగా పోటీ పడతాయి. ఇదే రోజు ఇంగ్లాండ్ – సౌత్ ఆఫ్రికా జట్లు సెయింట్ లూసియా వేదికగా పోటీ పడతాయి. జూన్ 22న అమెరికా – వెస్టిండీస్ జట్లు బార్బడోస్ వేదికగా తలపడతాయి. ఇదే రోజున భారత్ – బంగ్లాదేశ్ అంటిగ్వా వేదికగా పోటీ పడతాయి. జూన్ 23న ఆఫ్ఘనిస్తాన్ – ఆస్ట్రేలియా జట్లు విన్సెంట్ వేదికగా పోటీపడతాయి. అదే రోజు అమెరికా – ఇంగ్లాండ్ జట్లు బార్బడోస్ వేదికగా పోటీ పడతాయి. జూన్ 24న వెస్టిండీస్ – సౌత్ ఆఫ్రికా జట్లు ఆంటిగ్వా వేదికగా తలపడతాయి. ఇదే రోజు భారత్ – ఆస్ట్రేలియా జట్లు సెయింట్ లూసియా వేదికగా పోటీ పడతాయి. జూన్ 25న ఆఫ్ఘనిస్తాన్ – బంగ్లాదేశ్ జట్లు విన్సెంట్ వేదికగా తలపడతాయి. ఈ మ్యాచ్లలో గెలిచిన జట్లు సెమీస్ వెళ్తాయి.
రెండు గ్రూపులుగా విభజన
సూపర్ -8 లో ఉన్న జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ -1 బలమైన భారత్, అమెరికా వంటి జట్లు ఉన్నాయి. గ్రూప్ -2 లో వెస్టిండీస్, ఇంగ్లాండ్ వంటి జట్లు ఉన్నాయి. ఈ రెండు గ్రూపులలో భారత్, ఆస్ట్రేలియా జట్లు సెమిస్ వెళ్తాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అయితే గ్రూప్ -2 లో ఏ జట్లు సెమిస్ వెళ్తాయనేది అంతు పట్టకుండా ఉందని క్రీడా నిపుణులు చెబుతున్నారు..
దక్షిణాఫ్రికా
టి 20 వరల్డ్ కప్ లో సూపర్ -8 కు చేరిన తొలి జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. అయితే ఈ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్ లో పసికూన నేపాల్ జట్టుపై చివరి బంతికి విజయాన్ని దక్కించుకుంది. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఆశించిన గొప్పగా లేదు. బ్యాటింగ్ లో పస కనిపించడం లేదు. క్లాసెన్, మిల్లర్ మాత్రమే పర్వాలేదనే స్థాయిలో ఆడుతున్నారు. మార్క్రం, డికాక్ ఆశించినంత స్థాయిలో ఫామ్ లో లేరు. ఇది సౌత్ ఆఫ్రికా జట్టుకు ప్రతికూల అంశంగా మారింది.. మరోవైపు వెస్టిండీస్ మైదానాలు, అమెరికా మైదానాలతో పోల్చితే పూర్తి విభిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ స్లో మైదానాలపై సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు ఎలా ఆడతారనేది చూడాలి.. చోకర్స్ అనే పేరు ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సూపర్ -8 లోనే ఇంటికి వెళ్తారని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అమెరికా
తొలిసారి టి20 ప్రపంచ కప్ ఆడుతున్న ఈ జట్టు.. అసాధారణ విజయాలతో సూపర్ -8 కు చేరుకుంది. వాస్తవానికి ఇక్కడి దాకా రావడమే అమెరికా జట్టుకు అతిపెద్ద అదృష్టం. పాకిస్తాన్ జట్టుపై సూపర్ ఓవర్ లో నెగ్గిన అమెరికా.. 2003 వన్డే వరల్డ్ కప్ లో కెన్యా జట్టును జ్ఞప్తికి తేస్తోంది. ఇదే సమయంలో సూపర్ -8 పోరులోనూ అమెరికా సంచలన విజయాలు సాధించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ జట్టు సెమీస్ చేరడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వెస్టిండీస్
గత టి20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలోనే వెస్టిండీస్ ఇంటికి వెళ్లిపోయింది. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ కు అర్హత కూడా సాధించలేకపోయింది. అయితే స్వదేశంలో జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో రెచ్చిపోయి ఆడుతోంది. వెస్టిండీస్ జట్టు నిండా ఆల్ రౌండర్ ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా పవర్ హిట్టింగ్ లో సిద్ధహస్తులు. అయితే ప్రస్తుతం ఆటగాళ్లు ఆడుతున్న తీరు చూస్తే ఈ జట్టు సెమిస్ వెళ్తుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇంగ్లాండ్
గత టి20 వరల్డ్ కప్ ను దక్కించుకున్న ఇంగ్లాండ్.. ఈ టోర్నీలోకి డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో అడుగు పెట్టింది. పడుతూ లేస్తూ సూపర్ -8 దాకా వచ్చేసింది. స్కాట్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో ఇంగ్లాండ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాతో దారుణమైన ఓటమిని ఎదుర్కొంది. ఇక తర్వాత మ్యాచ్లలో పర్వాలేదనే స్థాయికి మించి ఆట తీరును ప్రదర్శించింది. ఆదిల్ రషీద్, లివింగ్ స్టోన్, మొయిన్ అలీ వంటి ఆటగాళ్లు కీలకంగా ఉన్నారు. వెస్టిండీస్ మైదానాలు స్లో వికెట్ కు అనుకూలిస్తాయి కాబట్టి.. ఇంగ్లాండ్ జట్టు సెమిస్ చేరడం పెద్ద కష్టం కాదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
ఇంగ్లాండ్, వెస్టిండీస్, భారత్, ఆస్ట్రేలియా జట్లకు సెమీస్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ లీగ్ దశ మాదిరి సంచలనాలు చోటు చేసుకుంటే.. ఏదైనా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. అసలే టి20 వరల్డ్ కప్.. పైగా వెస్టిండీస్ మైదానాలు స్లో గా ఉంటాయి. అలాంటప్పుడు అద్భుతం జరగొచ్చు. అంచనా వేసిన జట్లు ఇంటికి వెళ్లొచ్చు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: T20 world cup these are the teams that will reach the semi finals
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com