Sundar Pichai : పొట్టి క్రికెట్ ప్రపంచకప్‌లో ఇండియా – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ సాధించిన చిరస్మరణీయమైన విజయాన్ని భారతీయులంతా ఎంజాయ్ చేస్తున్నారు. దీపావళికి ఒక రోజు ముందే భారత క్రికెటర్లు పండుగ తెచ్చారని ప్రశంసిస్తున్నారు. ఇక సోషల్ మీడియా అయితే టీం ఇండియాపై ప్రశంసలతో హోరెత్తిపోతోంది. సాధారణ అభిమాని నుంచి దిగ్గజ వ్యాపారులు, భారత ప్రధాని, రాష్ట్రపతి వరకు టీం ఇండియా ప్రదర్శనను అభినందిస్తున్నారు. ఈ క్రమంలో గుగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా పాకిస్తాన్‌పై టీం ఇండియా గ్రాండ్ విక్టరీని ఎంజాయ్ చేస్తున్నారు. ఈమేరకు తన అభిమానాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూనే టీ20 మ్యాచ్‌లో చివరి మూడు ఓవర్లు తాను బాగా ఎంజాయ్ చేశానని ట్వీట్ చేశాడు. తాను మ్యాచ్ చూస్తూ దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో పిచాయ్ అభిమానులు, గూగుల్ ఉద్యోగులు ఆయన ట్వీట్‌పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. టీం ఇండియా స్పిరిట్‌ను, చిరవి మూడు ఓవర్లలో కోహ్లీ ఆటతీరును అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
సుందర్ పిచాయ్ చేసిన ట్వీట్ సారాంశం ఇలా ఉంది..
‘‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ప్రతి ఒక్కరూ పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను.. నేను ఈ దీపావళిని ఇండియా–పాకిస్తాన్ టీ20 క్రికెట్ మ్యాచ్ చూస్తూ జరుపుకుంటున్నాను. భారత ఇన్నింగ్స్‌లో చివరి మూడు ఓవర్లు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది’’ అని పోస్టు చేశారు సుందర్ పిచాయ్.
పిచాయ్ ట్వీట్‌పై పాక్ యువకుడి వ్యంగ్యం..
టీ20 క్రికెట్‌లో ఇండియా గ్రాండ్ విక్టరీని భారతీయులు ఎంజాయ్ చేస్తుంటే పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. దాయది జట్టుపై తమ జట్టు ఓడిపోవడంతో నిరాశలో ఉన్నారు. ఈక్రమంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన ట్వీట్‌పై పాకిస్తాన్ మహ్మద్ షహజాబ్ అనే యువకుడు వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. చివరి మూడు ఓవర్లు కాదు.. ఫస్ట్ మూడు ఓవర్లు చూడండి అని రీట్వీట్ చేశాడు.
షాక్ ఇచ్చిన పిచాయ్..
పాకిస్తాన్ క్రికెట్ అభిమాని తన ట్వీట్‌పై చేసిన కామెంట్‌కు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. తనదైన శైలిలో పాక్ క్రికెట్ అభిమానికి రిప్లై ఇచ్చారు. ‘‘అవును మొదటి మూడు ఓవర్లు కూడా చూడాల్సినవే. మంచి స్పెల్ వేశారు భువీ(భువనేశ్వర్), అర్షదీప్(హర్షదీప్‌సింగ్)’’ అంటూ ఇండియన్ బైలర్లను ప్రశంసించారు. షాకింగ్ ఆన్సర్‌తో పాక్ క్రికెటర్ అన్నీ మూసుకున్నట్లు ఉన్నాడు. మళ్లీ రిప్లై ఇవ్వలేదు. పిచాయ్ షాకింగ్ ఆన్సర్‌నూ ట్విట్టర్‌లో ఆయన ఫాలోవర్స్ అభినందిస్తున్నారు.