SRH vs RR: ప్రస్తుత ఐపిఎల్ లో సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నాడు సూపర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Surya Vamshi).. ఐపీఎల్ లో ప్రస్తుతం అతడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. ప్రతి మ్యాచ్లో మినిమం బ్యాటింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు. కొన్ని సందర్భాలలో మొండి ఘటంగా తయారవుతున్నాడు. 15 సంవత్సరాల వయసులోనే అతడు విధ్వంసానికి పర్యాయపదంగా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో ప్రత్యర్థి జట్ల బౌలర్లు భయపడుతున్నారు.
ఇప్పటికే వరుస ఓటములతో డీలా పడిపోయింది హైదరాబాద్ జట్టు. ఇటీవల సొంతం మైదానంలో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో లో స్కోర్ చేసి పరువు తీసుకుంది హైదరాబాద్. అలాగే పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారీగా స్కోర్ చేసినప్పటికీ ఓటమిపాలైంది. ఈ రెండు పరిణామాలు హైదరాబాద్ జట్టు మీద తీవ్రమైన ఒత్తిడిని పెంచాయి. ఈ క్రమంలో ఈ టోర్నీలో నిలవాలి అంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి హైదరాబాద్ మీద ఉంది. హైదరాబాద్ జట్టు అత్యంత కీలకమైన మ్యాచ్ ను సొంత గడ్డ మీద సోమవారం ఆడుతోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడబోతోంది. ఇప్పటివరకు ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే హైదరాబాద్ గెలిచింది. తిరిగి రేసులోకి రావాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి హైదరాబాద్ జట్టు మీద ఉంది.
రాజస్థాన్ జట్టులో వైభవ్ సూర్యవంశీ బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా అతడు సిక్సర్ లను అత్యంత సులభంగా కొడుతున్నాడు. ఇప్పటివరకు అతడు కొట్టిన సిక్సర్లను ఒకసారి పరిశీలిస్తే లెగ్ సైడ్ వైపు నుంచే ఎక్కువగా నమోదవుతున్నాయి. తన బాడీ లైన్ మీదకి వచ్చే బంతులను అతడు అత్యంత సులువుగా సిక్సర్లుగా మలుస్తున్నాడు. కాబట్టి వికెట్ల లైన్ మీద అతడికి బంతులు వేయడం అసలు సరైనది కాదు. హైదరాబాద్ బౌలర్లు అతడికి ఆఫ్ స్టంప్ వేలుపల బంతులు వేస్తూ.. షార్ట్ పిచ్ బంతులు వేస్తూ ఇబ్బంది పెట్టాలి. అతడి జోన్ లో బంతులు లేకుంటే చాలు. సూర్య వంశీ తన వేగానికి బ్రేక్ పడితే ఇబ్బంది పడతాడు. ఆ సమయంలో తప్పుచేసి దొరికిపోతాడు. నితీష్ కుమార్ రెడ్డి అవుట్ స్వింగర్లు ఎక్కువగా వేస్తూ ఉంటాడు.. అతనితో బౌలింగ్ వేయించడం ద్వారా వైభవ్ జోరుకు కళ్ళెం వేయవచ్చు.
హైదరాబాద్ జట్టు బౌలింగ్ లో కూడా సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. జయదేవ్, హర్షల్ వంటి బౌలర్లను పక్కన పెట్టాలి. ఎందుకంటే వారు వికెట్లు తీయలేక పోగా.. విపరీతంగా పరుగులు ఇస్తున్నారు. బెంచ్ మీద కొనసాగుతున్న ప్రపుల్ లేదా ఓంకార్ వంటి బౌలర్లకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వీరి బౌలింగ్ ఎలా ఉంటుందో ప్రత్యర్థి బ్యాటర్లకు తెలియదు. అలాంటప్పుడు వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. నితీష్ కుమార్ రెడ్డిని కేవలం బౌలర్గా మాత్రమే కాకుండా.. మిడిల్ ఆర్డర్లో ఆడించాలి. అప్పుడే జట్టుకు బలం చేకూరుతుంది.
ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రధానంగా ముగ్గురు బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్య వంశీ, ధృవ్ జూరెల్ సంచలన బ్యాటింగ్ తో అదరగొడుతున్నారు. ఈ ముగ్గురు గనుక స్టాండ్ తీసుకుంటే రాజస్థాన్ జట్టు సింపుల్గా 200 దాటడం ఖాయం. ఈ ముగ్గురిని పవర్ ప్లే లో కనుక వెనక్కి పంపిస్తాయి రాజస్థాన్ జట్టు భారీ స్కోర్ చేయలేదు. రవీంద్ర జడేజా.. హిట్ మేయర్.. పరాగ్ వంటి వారు ఈ సీజన్లో ఇప్పటివరకు గొప్ప స్కోరు చేయలేకపోయారు. రాజస్థాన్ జట్టు కు ఉన్నాయి బలహీనతను సొమ్ము చేసుకుంటే హైదరాబాద్ జట్టుకు అడ్డు ఉండదు.