Shreyas Iyer Happy Birthday: టీమిండియాలో అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. అతడు డిసెంబర్ ఆరో తేదీ నాటికి తన 30 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అద్భుతమైన కుడి చేతివాటం బ్యాటర్ అయిన అయ్యర్.. తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ముంబై జట్టు తరఫున ఆడాడు. ఏకంగా 6000 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2024 ఎడిషన్ లో కోల్ కతా జట్టును విజేతగా నిలిపాడు. అయినప్పటికీ అతడిని కోల్ కతా జట్టు రిటైన్ చేసుకోకపోవడం విశేషం. దీంతో అతడిని పంజాబ్ జట్టు26.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. 2024 ఎడిషన్ లో విజేతగా నిలిపినప్పటికీ.. వేలంలో కోల్ కతా జట్టు అయ్యర్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించకపోవడం విశేషం. 27 కోట్లతో రిషబ్ పంత్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆవిర్భవించాడు. అంతర్జాతీయ కెరియర్ ప్రకారం చూసుకుంటే ఇప్పటివరకు మూడు ఫార్మాట్లు కలిపి అయ్యర్ 127 మ్యాచ్ లు ఆడాడు. 4,331 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ జట్టుపై తన తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడాడు. శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఆ ఇన్నింగ్స్ హైలెట్
దూకుడుగా బ్యాటింగ్ చేసే అయ్యర్.. 2023లో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అదరగొట్టాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో సత్తా చాటాడు. అతనిలో ఉన్న మరో కోణాన్ని ఆ మ్యాచ్ ఆవిష్కరించింది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ లో ముంబై వేదికగా భారత్ – న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. వరుస విజయాలతో సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా గిల్, రోహిత్ బరిలోకి వచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 71 పరుగులు జోడించారు. 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ సౌతీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.. ఆ తర్వాత గిల్ 66 బంతులు ఎదుర్కొని 80 పరుగులు చేశాడు. కాలు తిమ్మిరి పట్టడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. ఆ తర్వాత అయ్యర్ మైదానంలోకి వచ్చాడు. కోహ్లీ, అయ్యర్ కలిసి భారత జట్టు స్కోరును 397 పరుల వద్దకు చేర్చారు. అయ్యర్ డెబ్బై బంతుల్లో నాలుగు ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 105 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ 113 బంతుల్లో 117 పరుగులు చేశాడు. కోహ్లీ, అయ్యర్ 163 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు.. భారత బౌలింగ్ ను దీటుగానే ఎదుర్కొంది. డారిల్ మిచెల్ 134 పరుగులు చేశాడు. అయితే మహమ్మద్ షమీ న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ లైన్ అప్ ను చిత్తు చేశాడు. అతడు ఏడు వికెట్లు పడగొట్టి.. భారత జట్టుకు 70 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు.
వచ్చే ఏడాది సరికొత్త అవతారం
ఇక ఐపీఎల్లో పంజాబ్ జట్టు కొనుగోలు చేయడంతో.. 2025 సీజన్ ను అయ్యర్ సరికొత్త అవతారంతో ప్రారంభించనున్నాడు.. అతని అభిమానులు దీనికోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా అయ్యర్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.