SA vs NED: డక్వర్త్ లూయిస్ పద్ధతి పుణ్యామా అని ఒక్క బంతికి 21 పరుగులు చేయాల్సి రావడం.. స్టీవ్ వా క్యాచ్ ను గిబ్స్ వదిలేసి “యు హావ్ డ్రాప్డ్ వరల్డ్ కప్ బ్రదర్” అని స్టీవ్ వాతో పంచ్ వేయించుకోవడం… గెలవాల్సిన మ్యాచ్ ను వాన మింగితే ఒక్క పాయింట్ తో సర్దుకోవడం అన్నీ పాపం దక్షిణాఫ్రికాకే ఎందుకో… మొత్తానికి టి20 ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదయింది. సౌత్ ఆఫ్రికా పై నెదర్లాండ్స్ విజయం సాధించింది. మునుపెన్నడూ లేనంత హోరా హోరిగా టి20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ సాగుతోంది. ఎలాంటి అంచనాలు లేని పసికూన జట్లు సంచలన విజయాలు నమోదు చేయడం కాకుండా పెద్ద జట్లకు ప్రపంచ కప్ ఆశలను దూరం చేస్తున్నాయి. ఆదివారం జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికాపై 13 పరుల తేడాతో విజయం సాధించి ప్రొటీస్ జట్టును టోర్నీకి దూరం చేసింది.. ముందు బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 158 పరుగులు చేసింది.. సౌత్ ఆఫ్రికా 145 పరుగులకే పరిమితమైంది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా సెమీస్ కి దూరమైంది.. కాగా భారత్ సెమీస్ బెర్త్ ఖరారు అయింది.

గెలవాల్సిన మ్యాచ్లో ఓటమితో ఇంటికి..
సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలి అంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతులు ఎత్తేసింది.. టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ను నెదర్లాండ్స్ ఆటగాళ్లు దీటుగా ఎదుర్కొన్నారు.. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేశారు.. కొలిన్ ఆకర్ మన్ 41 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.. స్టీఫెన్ మై బర్గ్ 37, టామ్ కోపర్ 35, మ్యాక్స్ ఓడౌడ్ 29 పరుగులు చేశారు. ప్రోటీస్ బౌలర్లలో కేశవ మహారాజు రెండు వికెట్లు పడగొట్టగా, నోర్ట్ జే 4 ఓవర్లు వేసి పది పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రొటీన్స్ బ్యాటర్లలో రోసో చేసిన 25 పరుగులే అత్యధిక స్కోరు.. తప్పకుండా వికెట్లు పడగొట్టిన నెదర్లాండ్స్ బౌలర్లు దక్షిణాఫ్రికా సెమిస్ ఆశలపై నీళ్లు చల్లారు.. బ్రాండన్ గ్లోవర్ మూడు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు.. డీ లీడ్, ఫ్రెక్ క్లాసన్ రెండు వికెట్లు, పాల్ వాన్ మీకేరెన్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరగబోయే మ్యాచ్ గ్రూప్2 నుంచి సెమిస్ చేరే జట్టు ఏది అనేది నిర్ణయించనుంది. ఈ రెండు జట్లలో విజయం సాధించిన జట్టు నేరుగా సెమిస్ కు అర్హత సాధిస్తుంది.

ఇప్పుడు సౌతాఫ్రికా ఓటమిపై సోషల్ మీడియాలో అందరూ అయ్యో పాపం అంటున్నారు. మీమ్స్, ట్రోల్స్ తో హోరెత్తిస్తున్నారు.