Smriti Mandhana Wedding Postponed: భారత మహిళా క్రికెట్ జట్టులో స్మృతి మందాన కీలకమైన ప్లేయర్ గా కొనసాగుతోంది. ఇటీవల టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించడంలో మందాన తన వంతు పాత్ర పోషించింది. బ్యాటింగ్లో అదరగొట్టింది. ఫీల్డింగ్లో పాదరసం లాగా కదిలింది. మహిళా ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టును విజేతగా నిలిపింది..
స్మృతి అద్భుతమైన క్రికెటర్. పైగా మైదానంలో చలాకీగా ఉంటుంది. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని సందడిగా ఉంచుతుంది. అటువంటి స్మృతి కొంతకాలంగా సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తో ప్రేమలో ఉంది.. తమ ప్రేమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత ఆదివారం సాంగ్లీలో వీరిద్దరి వివాహం జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దీంతో స్మృతి తరపు వారు నిర్వేదంలో మునిగిపోయారు.
స్మృతి తండ్రి శ్రీనివాస్ ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వివాహాన్ని వాయిదా వేశారు. శ్రీనివాస్ ఆదివారం పెళ్లి వేదిక దగ్గర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస్ అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. ప్రత్యేకమైన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. పెళ్లి వేదిక దగ్గర పనులను పర్యవేక్షిస్తున్న శ్రీనివాస్ అస్వస్థతకు గురి కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి గంటలు గడిస్తే గాని చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు.. దీంతో కుటుంబ సభ్యులు పెళ్లిని వాయిదా వేశారు. శ్రీనివాస్ కోలుకున్న తర్వాత పెళ్లి తేదీ ప్రకటిస్తామని స్మృతి కుటుంబ సభ్యులు వివరించారు.. మరోవైపు మీడియాకు స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా కీలక ప్రకటన చేశారు.
“స్మృతి తండ్రి ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఆసుపత్రికి తరలించారు.. ఇన్సెంటిక్ కేర్ యూనిట్ లో ఆయన చికిత్స పొందుతున్నారు.. ఆయన పూర్తిస్థాయిలో ఆరోగ్యాన్ని పొందిన తర్వాత పెళ్లి ఎప్పుడు జరపాలో చెబుతాం. ప్రస్తుతానికి వివాహాన్ని తాత్కాలికంగా వాయిదా వేసాం. ఇది కాస్త ఇబ్బంది కలిగించే పరిణామం అయినప్పటికీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నామని” స్మృతి మేనేజర్ పేర్కొన్నాడు.