Sachin Tendulkar BCCI President: భారత్ క్రికెట్ నియంత్రణ మండలి తదుపరి అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు? ఎవరి వైపు క్రికెట్ పెద్దలు ఆసక్తి చూపిస్తారు? కొద్దికాలంగా జాతీయ మీడియాలో జరుగుతున్న చర్చ ఇది. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలికి తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా కొనసాగుతున్నారు. త్వరలోనే నూతన అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు అంటే అంత ఈజీ కాదు. పేరుకు బిసిసిఐ ప్రెసిడెంట్ అయినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ క్రికెట్ మనుగడ భారత్ మీద ఆధారపడి ఉంది. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగైన ఐపిఎల్ ను కూడా బీసీసీఐ నిర్వహిస్తుంది. అందువల్లే బీసీసీఐ ప్రెసిడెంట్ అంటే ప్రపంచం ఆశ్చర్యంగా చూస్తుంది.
ఇటీవల రోజర్ బిన్నీ తన పదవి నుంచి తప్పుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన క్రీడా పాలసీలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజర్ బిన్నీ తప్పుకున్న తర్వాత రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. త్వరలోనే నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. కొత్త అధ్యక్షుడి నియామకంపై రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ.. అధికారికంగా బీసీసీఐ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే అధ్యక్షుడు నియామకానికి సంబంధించి ప్రకటన వస్తుంది అంటున్నారు. ఈ ప్రకటన ఎప్పుడనేది ఇంతవరకు క్లారిటీ లేదు . అయితే ఇప్పుడు జాతీయ మీడియాలో జరుగుతున్న తాజా చర్చ ఏమిటంటే.. బిసిసిఐకి త్వరలో అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్ నియమితులవుతారని తెలుస్తోంది. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇంకా అద్భుతమైన రోజులు వస్తాయని.. ప్రపంచం మీద భారత క్రికెట్ నియంత్రణ మండలి పెత్తనం మరింత పెరుగుతుందని అంచనాలు పెరిగిపోయాయి. అయితే దీనిపై సచిన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఏకంగా క్లారిటీ ఇచ్చారు.
సచిన్ బీసీసీఐ అధ్యక్షుడు కావడం అనేది అబద్ధమని ఎస్ఆర్టి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ పేర్కొంది. సచిన్ తరపున ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. వాస్తవానికి ఈ ప్రకటన సచిన్ చేయాల్సి ఉండగా.. సచిన్ మనోగతాన్ని ఎస్ ఆర్ టి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ బయటపెట్టింది..” సచిన్ టెండుల్కర్ కు సంబంధించిన రకరకాల ఊహాగానాలు మా దృష్టికి వచ్చాయి. అవన్నీ కూడా కల్పితాలు. అబద్ధాలు. ఊహాగానాలు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయకూడదు. అలా ప్రచారం చేస్తున్న వ్యక్తుల మాటలను అస్సలు నమ్మకూడదు. ఏదైనా ఉంటే సచిన్ నేరుగా ప్రకటన చేస్తారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు కావడం సచిన్ కు కూడా ఇష్టమే. కాకపోతే దానికి కాలం కలిసి రావాలని” ఎస్ ఆర్ టి స్పోర్ట్స్ ప్రకటించింది.