Tilak Varma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో ముంబై ఇండియన్స్ ఘోరంగా విఫలమవుతోంది. ఆ జట్టులోని కీలక ప్లేయర్లు ఆడలేక చేతులెత్తేస్తున్న పరిస్థితుల్లో.. తెలుగు తేజం తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ నైపుణ్యంతో జట్టును ఆదుకుంటున్నాడు. పరుగులు వరదపారిస్తున్న తిలక్ వర్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఈ సీజన్ లో తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఈ ఏడాది ఐపిఎల్ లో తెలుగు తేజం తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. ఈ సీజన్ లో యంగ్ క్రికెటర్ సంచలనంగా మారాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న తిలక్ వర్మ.. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ముంబై వరుసగా తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడినప్పటికీ తాను మాత్రం విఫలం కాలేదు. రోహిత్ శర్మ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.
బ్యాటింగ్ ఆర్డర్ లో తిలక్ వర్మకు ప్రమోషన్..
ఢిల్లీ క్యాపిటల్స్ తో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. అప్పటికే ధాటిగా ఆడుతున్న రోహిత్ కు జత అయ్యాడు. రోహిత్ శర్మ అండతో తిలక్ వర్మ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 29 బంతుల్లోనే 41 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ.. అప్పటికే ముంబై జట్టును పటిష్ట స్థితిలో నిలపాడు తిలక్ వర్మ. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ అవుట్ కాకపోయి ఉంటే 17 18 ఓవర్ లోనే మ్యాచ్ ముగిసి పోయేది. అయితే తిలక్ వర్మ, రోహిత్.. వెనువెంటనే అవుట్ కావడంతో మ్యాచ్ చివరి వరకు వెళ్ళింది. ఆఖరి బంతికి ఉత్కంఠ గా మారినప్పటికీ టీమ్ డేవిడ్ రెండు పరుగులు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు.
అద్భుతమైన ఫామ్ లో తిలక్ వర్మ..
ఈ సీజన్ లో మంచి ఫామ్ కనబరుస్తున్న తిలక్ వర్మ మూడు మ్యాచ్ లు కలిపి 147 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతని ఖాతాలో ఒక అర్థ సెంచరీ కూడా ఉంది. ఇక ఆర్సీబీతో ఆడిన తొలి మ్యాచ్ లో తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. 46 బంతుల్లోనే 84 పరుగులతో అజయంగా నిలిచాడు ఈ క్రికెటర్. స్టార్ ఆటగాళ్లు చేతులెత్తేసిన వేళ.. అంతా తానై ముంబై జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు.
అరుదైన గౌరవం దక్కించుకున్న తిలక్ వర్మ..
రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, టీమ్ డేవిడ్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమవుతున్న చోటే.. తిలక్ పరుగులు వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నాడు ఈ తెలుగు కుర్రాడు. లేటెస్ట్ గా తిలక్ వర్మతో రిలయన్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ పొజిషనింగ్, ఎండార్స్మెంట్లు, ప్రదర్శనలు, సోషల్ మీడియా మానిటైజేషన్, లైసెన్సింగ్ తో సహా అన్ని వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే రిలయన్స్ యాజమాన్యంలోని.. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ రైజ్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఇకపై కొన్ని రిలయన్స్ ప్రకటనల్లో తిలక్ వర్మ మెరవనున్నాడు. ఈ జాబితాలో తిలక్ వర్మ ఎనిమిదో ఆటగాడిగా నిలవడం గమనార్హం. అంతకు ముందు రోహిత్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా రిలయన్స్ తో కలిసి పని చేశారు. ఐపీఎల్ లో అదరగొడుతున్న తిలక్ వర్మను చూసి మాజీ క్రికెటర్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇలానే ఆడితే త్వరలో టీమిండియా ఎంట్రీ ఖాయమంటూ పొగడ్తలు పలువురు క్రికెటర్ల నుంచి కురుస్తోంది. ఇకపోతే ముంబై అభిమానులు తిలక్ వర్మ ప్రదర్శనతో ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూర్య కుమార్ వంటి కీలక ప్లేయర్లు ఫామ్ లో లేక తడబడుతున్న సమయంలో.. తిలక్ వర్మ జట్టును ఆదుకుంటున్నాడంటూ అభిమానుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.