Rohit Sharma: టీమిండియాకు టి20 వరల్డ్ కప్ అందించాడు. చాంపియన్స్ ట్రోఫీ కూడా అందించాడు. అతని ఆధ్వర్యంలో టీమిండియా 56 వన్డే మ్యాచ్లు ఆడగా.. 42 మ్యాచ్లలో విజయం సాధించింది. ఇతడి విజయాల శాతం 76 గా ఉంది. రోహిత్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2023 లో ఆసియా కప్ సాధించింది. ఇక బ్యాటింగ్ విషయంలో రోహిత్ శర్మకు వంకపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అదరగొడతాడు.
ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం పట్ల బీసీసీఐ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఆస్ట్రేలియా సిరీస్ లో టీమ్ ఇండియాను రోహిత్ నడిపిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా బిసిసిఐ శనివారం ఉదయం రోహిత్ శర్మతో మాట్లాడింది. అతనితో చర్చలు ఫలప్రదమైన తర్వాత చివరికి కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో గిల్ కు బాధ్యతలు అప్పగించింది.
రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం పట్ల రకరకాల వార్తలు మీడియాలో ప్రసారమవుతున్నాయి. జాతీయ మీడియాలో విభిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే రోహిత్ ను పక్కన పెట్టడం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని యువనాయకత్వాన్ని సిద్ధం చేయడానికి బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 2027 వరకు మీరు ఆడతారా? అనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ను మేనేజ్మెంట్ అడిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నలకు వారిద్దరు స్పష్టమైన సమాధానాలు చెప్పలేదని సమాచారం. అందువల్లే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించారని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సాధారణ ఆటగాళ్లు గానే జట్టులో కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అతని అభిమానులు బిసిసిఐ మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు అద్భుతమైన విజయాలు అందించిన ఆటగాడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అందరూ మండిపడుతున్నారు.. రోహిత్ సేవలను బీసీసీఐ మరిచిపోయినప్పటికీ.. అభిమానులమైన తాము మర్చిపోమని నెటిజన్లు పేర్కొంటున్నారు..
రోహిత్ భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుతం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. తన బరువును చాలావరకు తగ్గించుకున్నాడు. వికెట్ల మధ్య పరుగులు పెట్టడంలో మరింత వేగాన్ని ప్రదర్శిస్తున్నాడు. అందువల్లే రోహిత్ మరింత అందంగా కనిపిస్తున్నాడు. బరువును కోల్పోవడంతో నాజూకుగా దర్శనమిస్తున్నాడు. ఇంత కసరతులు చేసినప్పటికీ అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించడం అభిమానులను కలవర పరుస్తోంది.